ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీల్ని ఒక్కటీ నెరవేర్చలేదని, ఈ అంశంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 19న జరగనున్న తొలిఫేజ్ లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి కాంగ్రెస్ అభ్యర్ధి వి.వైతిలింగంకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఖర్గే.. ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర పొందడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు అందిస్తామన్న హామీ ఏమైందని అన్నారు.
ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించిన ఖర్గే.. ప్రతిపక్ష పార్టీ నేతల్ని వేధించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించేందుకు ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment