![Naveen Jindal joins BJP to fight from Kurukshetra - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/24/Naveen-Jindal.jpg.webp?itok=bACI4ZO5)
పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. అలా చేరారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు బీజేపీ టికెట్ ప్రకటించింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది.
అంతకుముందు రోజు నవీన్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను పదేళ్లు కురుక్షేత్ర నుంచి ఎంపీగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నాను’ అన్నారు.
కాంగ్రెస్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. పార్టీతో జిందాల్ అనుబంధం దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళుతుందన్నారు.
దేశంలోని ప్రముఖ జిందాల్ స్టీల్ & పవర్ (JSP) గ్రూప్‌నకు నవీన్ జిందాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి వ్యవస్థాపక ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. పోలో, స్కీట్ షూటింగ్ వంటి క్రీడల్లో జాతీయ గుర్తింపును సాధించారు. శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి షల్లు జిందాల్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నవీన్ జిందాల్ 2004 నుంచి 2014 వరకు కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2014 జాతీయ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజ్ కుమార్ సైనీపై ఓటమిని ఎదుర్కొన్నారు. తదనంతరం 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment