వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)ను టార్గెట్ చూస్తూ తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే డల్లాస్‌లో విమర్శలు గుప్పించిన రాహుల్. తాజాగా వర్జినాలోనూ అదే తరహాలో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలు, మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్ఎస్ఎస్ తక్కువ అన్న అభిప్రాయంతో చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
అలాగే భారత్‌లో సిక్కు మతస్థుడు తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో, సిక్కులను గురుద్వారా వెళ్లనిస్తారో లేదో అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌లో జరుగుతున్న పోరాటం ఇదే అని, రాజకీయ పోరాటం కాదు అని ఆయన తెలిపారు. అయితే యూఎస్‌లో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ.. విదేశాల వేదికగా ప్రవాసుల భారతీయుల మధ్య దేశంపై ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.
‘రాహుల్ వ్యాఖ్యలు దుర్మార్గం. అతని ముందు ఉన్న వారు నా కమ్యూనిటీకి చెందినవారు. వారు యూఎస్‌లో జీవిస్తున్నారు. దేశంతో బలమైన సంబంధం లేదు. అలాంటి వారికి రాహుల్ తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారు. తన అమెరికా పర్యటనలో భారత న్యాయ వ్యవస్థపై, ఎన్నికల ఫలితాలపై, కాంగ్రెస్ ఖాతాల స్తంభణపై మాట్లాడుతున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన అభివృద్ధి గురించి ప్రాస్తావించడం విస్మరించారు.
నేను ఆరు దశాబ్దాలుగా ఓ సిక్కుగా టర్బన్ (తలపాగా) ధరిస్తున్నాను. కడెం కూడా వేసుకుంటున్నాను. దీన్ని ధరించడంలో ఎప్పుడూ సమస్య రాలేదు. అసలు రాహుల్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు భయాందోళనతో జీవించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత1984లో సిక్కులపై హత్యాకాండ జరిగింది. మూడు వేల మంది అమాయక ప్రజలను చంపారు. వారిని ఇళ్ల నుంచి బయటకు లాగి సజీవ దహనం చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో సిక్కు సమాజం చాలా సురక్షితంగా, గౌరవంగా జీవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment