న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్లలో రారాజు అయిన మారుతి సుజుకీ కరోనా దెబ్బకు నష్టాల పాలైంది. జూన్‌తో అంతమైన మూడు నెలల కాలంలో రూ.268 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చింది. 2003 జూలైలో కంపెనీ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లలో లిస్ట్ అయిన తర్వాత నష్టాలు ఎదుర్కోవడం మొదటిసారి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే జూన్ త్రైమాసికంలో మారుతి రూ.1,377 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను కళ్ల చూడగా, కరోనా మహమ్మారి కారణంగా కార్యకలాపాలపై గట్టి ప్రభావమే పడినట్టు తెలుస్తోంది.
ఇక జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.18,739 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పరిమితమైంది. వాహన విక్రయాలు 76,599 యూనిట్లుగా ఉన్నాయి. వీటిల్లో దేశీయంగా 67,027 వాహనాలను విక్రయించగా, 9,572 యూనిట్లను ఎగుమతి చేసింది. కానీ సరిగ్గా ఏడాది క్రితం ఈ కాలంలో కంపెనీ విక్రయాలు 4,02,594 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ చరిత్రలోనే ఇదొక అసాధారణ త్రైమాసికం.
ఈ కాలంలో ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ కారణంగా అధిక సమయం ఎటువంటి ఉత్పత్తి, విక్రయాలకు అవకాశం లభించలేదు. మా మొదటి ప్రాధాన్యత ఉద్యోగులు, భాగస్వాములు, కస్టమర్ల ఆరోగ్యం, భద్రతకే. దీంతో జూన్ త్రైమాసికంలో చేసిన మొత్తం ఉత్పత్తి సాధారణ రోజుల్లో అయితే రెండు వారాల ఉత్పత్తికి సమానం’’ అని మారుతి సుజుకీ తన ప్రకటనలో వివరించింది. కరోనా ముందస్తు కార్యకలాపాల స్థాయికి చేరువ అవుతున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకీ స్టాక్ బీఎస్‌ఈలో 1.6 శాతం నష్టపోయి రూ.6,186 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment