సెన్సెక్స్‌ 337 పాయింట్లు అప్‌ | Sensex closes 337 points higher | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 337 పాయింట్లు అప్‌

Published Sat, Sep 7 2019 4:47 AM | Last Updated on Sat, Sep 7 2019 5:08 AM

Sensex closes 337 points higher - Sakshi

వాహన రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఒప్పందం కుదరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చైనా, ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్యాకేజీలను ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పుంజుకొని 71.68 వద్ద ముగియడం... రూపాయి వరుసగా మూడో రోజూ బలపడటం  కలసివచ్చింది. ...బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 337 పాయింట్లు పెరిగి 36,982 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 10,946 పాయింట్ల వద్ద ముగిశాయి. గణేశ్‌ చవితి సందర్భంగా సోమవారం సెలవు కావడంతో నాలుగు రోజులే ట్రేడింగ్‌ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌  351 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు చొప్పున తగ్గాయి.
 
అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం అభయం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాహన షేర్ల లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. మారుతీ సుజుకీ 3.6 శాతం, బజాజ్‌ ఆటో 2.9 శాతం, టాటా మోటార్స్‌ 2.5 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 2.3 శాతం, హీరో మోటొకార్ప్‌ 2.1 శాతం చొప్పున  లాభపడ్డాయి.  

► స్టాక్‌ మార్కెట్‌ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.09 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.09 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,28,104కు పెరిగింది.  

► ప్రభాత్‌ డైరీ షేర్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.78 వద్ద ముగిసింది. స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఈ షేర్‌ను డీలిస్ట్‌ చేయడం కోసం ప్రమోటర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు దీనికి కారణం.


70కి పైగా ఏడాది కనిష్టం...
స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడినా, దాదాపు 70కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాక్స్‌ అండ్‌ కింగ్స్, అలోక్‌ ఇండస్ట్రీస్, ఎడ్యుకాంప్‌ సొల్యూషన్స్, ఆర్‌కామ్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు అబాట్‌ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ట్రీ హౌస్‌ ఎడ్యుకేషన్‌ వంటి పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.  


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement