కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు.. టాప్‌గేర్‌లో అమ్మకాలు.. | Compact SUVs double sales in India | Sakshi
Sakshi News home page

కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు.. టాప్‌గేర్‌లో అమ్మకాలు..

Published Thu, Oct 31 2024 3:28 AM | Last Updated on Thu, Oct 31 2024 7:07 AM

Compact SUVs double sales in India

తొలిసారి హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్‌లను మించి సేల్స్‌

కారు ప్రియుల ఫస్ట్‌ ఛాయిస్‌ ఎస్‌యూవీలే

ఒకపక్క కార్ల కంపెనీలు బంపీ రైడ్‌తో సతమతమవుతున్నప్పటికీ... స్పోర్ట్స్‌  యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీలు) తగ్గేదేలే అంటున్నాయి. భారతీయులకు తొలి 
చాయిస్‌గా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా అమ్మకాల్లో పైచేయి సాధించిన హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్స్‌ ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల విభాగంగా కాంప్టాక్ట్‌ ఎస్‌యూవీలు కేక పుట్టిస్తున్నాయి!!     

దేశంలో కారు ప్రియుల కొనుగోలు ట్రెండ్‌ శరవేగంగా మారిపోతోంది. 4 మీటర్ల లోపు పొడవైన హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్‌ల (కాంపాక్ట్‌ ప్యాసింజర్‌ కార్లు) హవాకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఎస్‌యూవీలు రాజ్యమేలుతున్న కాలంలో కూడా అమ్మకాల్లో టాప్‌లేపిన ఈ సెగ్మెంట్‌ను తొలిసారిగా కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు ఓవర్‌టేక్‌ చేశాయి. 

భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సొసైటీ (సియామ్‌) తాజా లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (2024–25, ఏప్రిల్‌–సెప్టెంబర్‌)లో 4 మీటర్ల లోపు కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు దుమ్మురేపాయి. ఈ సెగ్మెంట్లో 6,71,674 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే తరుణంలో కాంపాక్ట్‌ ప్యాసింజర్‌ కార్ల సేల్స్‌ 5,58,173 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ఈ రెండు విభాగాల అమ్మకాలు  రివర్స్‌ కావడం విశేషం. 

రివర్స్‌ గేర్‌...
గతేడాది వరకు దేశంలో కాంపాక్ట్‌ ప్యాసింజర్‌ కార్ల జోరుకు తిరుగేలేదు. అమ్మకాల్లో ఈ విభాగానికిదే టాప్‌ ర్యాంక్‌. నాలుగేళ్ల క్రితమైతే కాంపాక్ట్‌ ఎస్‌యూవీలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సేల్స్‌ నమోదయ్యాయి. ఐదేళ్లకు ముందు చూస్తే, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ 1 అమ్ముడైతే కాంపాక్ట్‌ ప్యాసింజర్‌ కార్లు 3 హాట్‌ కేకుల్లా రోడ్డెక్కేవి. ఇదంతా గతం. దేశంలో నవతరం దూకుడు... ఆటోమొబైల్‌ రంగం ముఖచిత్రాన్ని మలుపుతిప్పుతోంది. మరోపక్క, ఎంట్రీ లెవెల్‌ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటుల ధరల్లో లభిస్తుండటంతో గ్రామీణ కార్‌ లవర్స్‌ సైతం వీటికే సై అంటున్నారు. దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్‌ ఓ రేంజ్‌లో ఉంటోందనేది నిపుణుల మాట.

 టాటా పంచ్, నెక్సాన్, మారుతీ ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, హ్యుందాయ్‌ వెన్యూ, ఎక్స్‌టర్, కియా సోనెట్, మారుతీ బ్రెజా, నిస్సాన్‌ మాగ్నైట్, రెనో కైగర్, సిట్రాన్‌ సీ3, ఎయిర్‌క్రాస్‌ వంటివి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో బాగా అమ్ముడవుతున్న మోడల్స్‌. వీటిలో కొన్ని కార్లు నెలకు 10,000 అమ్మకాల మార్కును కూడా అధిగమిస్తుండటం విశేషం! ఇక కాంపాక్ట్‌ ప్యాసింజర్‌ కార్ల విషయానికొస్తే, మారుతీదే పూర్తి ఆధిపత్యం. స్విఫ్ట్, వ్యాగన్‌ ఆర్, బాలెనో, డిజైర్‌ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇతర కార్లలో టాటా టిగోర్, ఆ్రల్టోజ్, టియాగో, హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10, ఐ20 వంటివి అంతంతమాత్రంగానే అమ్ముడవుతుండటం గమనార్హం. 

హ్యాచ్‌బ్యాక్, సెడాన్‌ మోడల్స్‌ డౌన్‌... 
కారణాలేవైనప్పటికీ గత కొంతకాలంగా కాంపాక్ట్‌ పాసింజర్‌ కారు మోడల్స్‌ కనుమరుగవుతున్నాయి. ఫోర్డ్‌ మోటార్స్‌ 2022లో ఇండియా నుండి దుకాణం సర్దేయడంతో ఫిగో, ఫిగో యాస్పైర్, ఫ్రీస్టయిల్, ఫియస్టా వంటి బాగా పాపులర్‌ మోడల్స్‌ అందుబాటులో లేకుండా పోయాయి. ఫోర్డ్‌ నిర్ణయంతో హాట్‌ ఫేవరెట్‌ ఎకోస్పోర్ట్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సైతం మార్కెట్‌కు దూరం కావడం గమనార్హం. హోండా సైతం జాజ్, బ్రియో వంటి హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలను అపేసింది. 

 హోండా సిటీ సేల్స్‌ కూడా నేలచూపులు చూస్తున్నాయి. మరోపక్క, డాట్సన్‌ కూడా 2022లో గుడ్‌బై చెప్పడంతో గో, రెడీగో వెళ్లిపోయాయి. టయోటా లివా, ఫోక్స్‌వ్యాగన్‌ అమియో, పోలో సైతం సెలవు తీసుకున్నాయి. ఐదేళ్ల క్రితం దాదాపు 30 వరకు ప్యాసింజర్‌ కారు మోడల్స్‌ కస్టమర్లకు విభిన్న ఆప్షన్లతో కనువిందు చేయగా.. ఇప్పుడీ సంఖ్య 15కు పడిపోవడం విశేషం. ఒకపక్క మోడల్స్‌ తగ్గిపోవడంతో పాటు కస్టమర్ల కొనుగోలు ధోరణి మారుతుండం కూడా కాంపాక్ట్‌ ప్యాసింజర్‌ కార్లకు గండికొడుతోంది!!

ఆకట్టుకుంటున్న ఫీచర్లు... 
కాస్త ధరెక్కువున్నప్పటికీ, మరిన్ని ఫీచర్లు లభిస్తుండటంతో చాలా మంది కస్టమర్లు కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్‌ కార్లతో పోలిస్తే విశాలమైన స్పేస్, బలిష్టమైన రూపంతో పాటు మెరుగైన డ్రైవింగ్‌ అనుభవం వల్ల కూడా కస్టమర్లు వీటికి జై కొడుతున్నారని మారుతీ మాజీ సేల్స్, మార్కెటింగ్‌ హెడ్‌ అభిప్రాయపడ్డారు. ‘ఎస్‌యూవీల సీటింగ్‌ పొజిషన్‌ ఎత్తు గా ఉండటం వల్ల కేబిన్‌ నుండి రోడ్డు వ్యూ బాగుంటుంది. అంతేకాకుండా, అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వల్ల మన దగ్గరు న్న గతుకుల రోడ్లపై డ్రైవింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటికి మంచి ఆదరణ లభిస్తోంది’ అని చెప్పారు. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement