
బీరుట్: ఆర్థిక అవకతవకల ఆరోపణలతో జపాన్ నుంచి నాటకీయంగా తప్పించుకున్న ఆటోమొబైల్ సంస్థ రెనో–నిస్సాన్ మాజీ చీఫ్ కార్లోస్ ఘోన్ .. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. నిస్సాన్, జపాన్ ప్రాసిక్యూటర్లు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జపాన్ నుంచి లెబనాన్‌కు పరారైన తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనపై మోపిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు నిరాధారమైనవని ఆయన చెప్పారు. ‘నేను 17 ఏళ్లుగా సేవలందించిన దేశమే నన్ను బందీగా చేసింది అనిపించింది. న్యాయం సంగతి పక్కనపెడితే అక్కడ కనీసం నా మాట పట్టించుకునే పరిస్థితే లేదు. నా మిత్రులు, కుటుం బంతో ఎలాంటి సంబంధాలు లేకుండా తెంచేశారు. నేను ఏ తప్పూ చేయనప్పటికీ.. తుది తీర్పు కోసం అయిదేళ్లు నిరీక్షించాల్సి ఉంటుం దని లాయర్లు చెప్పారు. దీంతో గత్యంతరం లేక బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వచ్చింది‘ అని ఘోన్ పేర్కొన్నారు.