Renault-Nissan Alliance
-
భారత్‌లో రెనో–నిస్సాన్ రూ. 5,300 కోట్ల పెట్టుబడులు
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో–నిస్సాన్ భారత్‌లో సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,300 కోట్లు) ఇన్వెస్ట్ చేయను న్నాయి. రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఆరు కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. అలాగే చెన్నైలోని తమ ప్లాంటును కూడా అప్‌గ్రేడ్ చేయనున్నాయి. నిస్సాన్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా ఈ విషయాలు తెలిపారు. రెనో ఇండియా కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని నోడల్ ఏజెన్సీ గైడెన్స్ బ్యూరో ఎండీ విష్ణు వేణుగోపాల్, గుప్తా ఇచ్చిపుచ్చుకున్నారు. రెనో–నిస్సాన్ అనేది ఫ్రాన్స్‌కి చెందిన రెనో, జపాన్‌కి చెందిన నిస్సాన్ కంపెనీల జాయింట్ వెంచర్. కొత్తగా వచ్చే వాహనాల్లో నాలుగు ఎస్‌యూవీలు ఉంటాయి. వీటిలో మొదటిది 2025 నాటికి మార్కెట్లోకి రానుందని గుప్తా చెప్పారు. దేశీయంగా ప్రవేశపెట్టే ఆరు వాహనాల్లో నిస్సాన్, రెనోవి చెరో మూడు వాహనాలు ఉంటాయి. తాజా పెట్టుబడులతో కొత్తగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని గుప్తా ఈ సందర్భంగా వివరించారు. పునర్వ్యవస్థీకరణ.. జాయింట్ వెంచర్లో సమాన వాటాదార్లుగా ఉండేలా రెండు సంస్థలు భారత్‌లో తమ తయారీ, ఆర్అండ్డీ విభాగాల్లో పెట్టుబడుల స్వరూపంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. దీని ప్రకారం జేవీలో నిస్సాన్ వాటా 70 శాతం నుంచి 51 శాతానికి తగ్గనుండగా రెనో వాటా 30 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. తమ చెన్నై తయారీ కేంద్రాన్ని 2045 నాటికల్లా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌తో నడిచేలా తీర్చిదిద్దనున్నట్లు గుప్తా వివరించారు. భారత మార్కెట్‌కు రెనో, నిస్సాన్ కట్టుబడి ఉన్నాయని నిస్సాన్ రీజియన్ చైర్పర్సన్ (ఆఫ్రికా తదితర ప్రాంతాలు) గిలోమ్ తెలిపారు. -
Electric vehicle: కేవలం ఈవీ టెక్నాలజీ కోసమే లక్షాఎనభై వేల కోట్లు!
రాబోయేది ఈవీల కాలమే. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందుకే ఆటోమొబైల్‌తో పాటు మొబైల్ మేకింగ్, ఇతర కంపెనీలు సైతం ఈవీల తయారీ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో కేవలం ఈవీ టెక్నాలజీ కోసమే లక్షా ఎనభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యాయి రెనాల్డ్ నిస్సాన్ కంపెనీలు. ఫ్రెంచ్ జపనీస్ ఆటోమొబైల్‌ల కూటమి ‘ఈవీ టెక్నాలజీ’ కోసం 26 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో లక్షా 82 వేల కోట్ల రూపాయలకు పైనే) పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈ మేరకు గురువారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ కూటమి. వచ్చే ఐదేళ్లకు ఈమేర ఖర్చు చేయనున్న కంపెనీలు పనిలో పనిగా జపాన్ ఆటోమేకర్ మిట్సుబిషి మోటార్స్ కార్పొరేషన్‌ను తమతో భాగస్వామిగా చేర్చుకున్నాయి. ఈవీలకు సంబంధించి పరిశోధనతో పాటు ఆటో పార్ట్లు, ధరలను తగ్గించే టెక్నాలజీ తదితరాల ఆధారంగా 35 కొత్త మోడల్స్‌తో ఈవీలను రూపొందించనున్నాయి. ఈ మేరకు 2030 ఏడాదిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఐదు మోడల్స్‌కు ఒకే విధమైన ప్రధాన విభాగాల్ని ఉపయోగించాలని ప్లాన్ చేశాయి. నిస్సాన్ తర్వాతి తరం బ్యాటరీల మీద ఫోకస్ చేస్తుండగా.. రెనాల్ట్ ఈవీలను అభివృద్ధి చేయడం, సాఫ్ట్వేర్, డిజిటల్ సేవలు, ఫీచర్స్ మీద దృష్టి సారించనున్నట్లు కూటమి చైర్మన్ జీన్ డోమినిక్యూ సెనార్డ్ ప్రకటించారు. రెనాల్ట్కు నిస్సాన్‌లో 43 శాతం వాటా ఉంది, అలాగే రెనాల్ట్‌లో నిస్సాన్‌కు 15 శాతం వాటా ఉంది. టోక్యోకు చెందిన మిట్సుబిషిలో నిస్సాన్(యోకోహామా కేంద్రంగా)కు 34 శాతం వాటా ఉంది. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వానికి రెనాల్ట్‌లో 15 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్ షార్టేజ్ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇలా కొన్ని కంపెనీలు చేతులు కలిపి ఈవీ మార్కెట్లో రాణించాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ భాగస్వామి లేకుండా ప్రపంచంలో నెంబర్ వన్‌గా, ఈవీ కింగ్‌గా కొనసాగుతోంది మాత్రం అమెరికన్ ఆటో మేకర్ టెస్లానే. -
నాపై కుట్ర చేస్తున్నారు..
బీరుట్: ఆర్థిక అవకతవకల ఆరోపణలతో జపాన్ నుంచి నాటకీయంగా తప్పించుకున్న ఆటోమొబైల్ సంస్థ రెనో–నిస్సాన్ మాజీ చీఫ్ కార్లోస్ ఘోన్ .. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. నిస్సాన్, జపాన్ ప్రాసిక్యూటర్లు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జపాన్ నుంచి లెబనాన్‌కు పరారైన తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనపై మోపిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు నిరాధారమైనవని ఆయన చెప్పారు. ‘నేను 17 ఏళ్లుగా సేవలందించిన దేశమే నన్ను బందీగా చేసింది అనిపించింది. న్యాయం సంగతి పక్కనపెడితే అక్కడ కనీసం నా మాట పట్టించుకునే పరిస్థితే లేదు. నా మిత్రులు, కుటుం బంతో ఎలాంటి సంబంధాలు లేకుండా తెంచేశారు. నేను ఏ తప్పూ చేయనప్పటికీ.. తుది తీర్పు కోసం అయిదేళ్లు నిరీక్షించాల్సి ఉంటుం దని లాయర్లు చెప్పారు. దీంతో గత్యంతరం లేక బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వచ్చింది‘ అని ఘోన్ పేర్కొన్నారు. -
రెనాల్ట్-నిస్సాన్‌లు జతకట్టి...
బ్యూనస్ ఎయిర్స్ : అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, నిస్సాన్ అలయెన్స్ లో అర్జెంటీనాలో 800 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు ప్రకటించాయి. అర్జెంటినా ప్రెసిడెంట్ మారికో మాక్రితో భేటీ అనంతరం రెనాల్ట్-నిస్సాన్ చైర్మన్, సీఈవో కార్లోస్ ఘోసన్ శుక్రవారం ఈ పెట్టుబడి విషయాన్ని వెల్లడించారు.ఈ ప్లాన్ ప్రకారం ప్రత్యక్షంగా వెయ్యి ఉద్యోగాలు, పరోక్షంగా రెండు వేల ఉద్యోగాలు సృష్టించబోతున్నట్టు తెలిపారు. నిస్సాన్ ఎన్పీ300 ఫ్రాంటీయర్, రెనాల్ట్ ఆలాస్కాన్ వంటి మొదటి లైన్ ఫాబ్రికేషన్ల ఆవిష్కరణల కోసం 600 మిలియన్ డాలర్లను పెట్టుబడులను వెచ్చిస్తామని చెప్పారు. రెనాల్ట్ సాండెరో, సాండెరో స్టెప్‌వే,లోగాన్ మోడల్స్ ఉత్పత్తికి మరో 100 మిలియన్ డాలర్లను వెచ్చిస్తామని ఈ కార్ల తయారీ అలయెన్స్ తెలిపింది. మరో 100 మిలియన్ డాలర్లను కొత్త మోడల్ ఉత్పత్తికి కేటాయిస్తామని పేర్కొన్నారు. .