చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో–నిస్సాన్ భారత్‌లో సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,300 కోట్లు) ఇన్వెస్ట్ చేయను న్నాయి. రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఆరు కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. అలాగే చెన్నైలోని తమ ప్లాంటును కూడా అప్‌గ్రేడ్ చేయనున్నాయి. నిస్సాన్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా ఈ విషయాలు తెలిపారు.
రెనో ఇండియా కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని నోడల్ ఏజెన్సీ గైడెన్స్ బ్యూరో ఎండీ విష్ణు వేణుగోపాల్, గుప్తా ఇచ్చిపుచ్చుకున్నారు. రెనో–నిస్సాన్ అనేది ఫ్రాన్స్‌కి చెందిన రెనో, జపాన్‌కి చెందిన నిస్సాన్ కంపెనీల జాయింట్ వెంచర్.
కొత్తగా వచ్చే వాహనాల్లో నాలుగు ఎస్‌యూవీలు ఉంటాయి. వీటిలో మొదటిది 2025 నాటికి మార్కెట్లోకి రానుందని గుప్తా చెప్పారు. దేశీయంగా ప్రవేశపెట్టే ఆరు వాహనాల్లో నిస్సాన్, రెనోవి చెరో మూడు వాహనాలు ఉంటాయి. తాజా పెట్టుబడులతో కొత్తగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని గుప్తా ఈ సందర్భంగా వివరించారు.
పునర్‌వ్యవస్థీకరణ..
జాయింట్ వెంచర్లో సమాన వాటాదార్లుగా ఉండేలా రెండు సంస్థలు భారత్‌లో తమ తయారీ, ఆర్‌అండ్‌డీ విభాగాల్లో పెట్టుబడుల స్వరూపంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. దీని ప్రకారం జేవీలో నిస్సాన్ వాటా 70 శాతం నుంచి 51 శాతానికి తగ్గనుండగా రెనో వాటా 30 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. తమ చెన్నై తయారీ కేంద్రాన్ని 2045 నాటికల్లా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌తో నడిచేలా తీర్చిదిద్దనున్నట్లు గుప్తా వివరించారు. భారత మార్కెట్‌కు రెనో, నిస్సాన్ కట్టుబడి ఉన్నాయని నిస్సాన్ రీజియన్ చైర్‌పర్సన్ (ఆఫ్రికా తదితర ప్రాంతాలు) గిలోమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment