
ముగిసిన ‘అంబాసిడర్’ శకం!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ రంగంలో ఒక వెలుగువెలిగి... రాజకీయ నాయకులకు అధికారిక వాహనంగా పేరొందిన అంబాసిడర్ కారు ఇక గత జ్ఞాపకంగా మిగిలిపోనుందా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ‘భారతీయ రోడ్లపై రారాజు’గా విఖ్యాతి చెందిన ఈ కార్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు వీటిని తయారు చేస్తున్న హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ప్రకటించింది.
ముఖ్యంగా అమ్మకాలు ఘోరంగా పడిపోవడం, డిమాండ్ లేకపోవడం, రుణభారం తీవ్రతరం కావడం వంటి కారణాలవల్లే తయారీని ఆపేస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన మోరిస్ ఆక్స్‌ఫర్డ్ కారు డిజైన్ ఆధారంగా 1957 నుంచి దేశంలో అంబాసిడర్ కార్లను హిందుస్థాన్ మోటార్స్ తయారుచేస్తూవస్తోంది. గత 60 ఏళ్లలో కారు డిజైన్‌లో పెద్దగా మార్పులేవీ చేయకపోవడం, విదేశీ కార్ల దిగ్గజాలతో పోటీలో చాలా వెనుకబడటం కూడా కంపెనీకి ప్రతికూలంగా మారాయి.
‘పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్‌ను మూసేశాం. నిరవధికంగా తయారీని నిలిపివేస్తున్నాం. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో అనవసరంగా ఈ కార్ల తయారీకి మరింత సొమ్మును వెచ్చించలేం. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ పునరుద్ధరణ ప్రణాళికలు రూపొందించుకోవడానికి మాకు వీలవుతుంది’ అని కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, బీఎస్‌ఈకి కూడా శనివారమే కంపెనీ తాజా పరిణామాలను తెలియజేసింది. నిధుల లేమి, డిమాండ్ అట్టడుగుకు పడిపోవడం, అప్పులు పేరుకుపోవడం వల్లే ప్లాంట్‌ను మూసేసినట్లు వెల్లడించింది.
అనేక కొత్త మోడళ్ల కార్లు భారత్‌లో కస్టమర్ల మనసు దోచుకున్నప్పటికీ.. అంబాసిడర్ మాత్రం చాన్నాళ్లు రాజకీయ నాయకులు, అధికారులకు అత్యంత ప్రీతిపాత్రమైన వాహనంగా నిలిచింది. అయితే, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల(ఎస్‌యూవీ) హవాతో సీనియర్ బ్రూరోక్రాట్లు, రాజకీయ నాయకులు సైతం అంబాసిడర్‌ను వదలేసి.. వాటివైపు మొగ్గుచూపారు. అయితే, ట్యాక్సీ డ్రైవర్లు, కొందరు రాజకీయవేత్తలతోపాటు భారత్‌కు వచ్చే విదేశీ టూరిస్టుల నుంచి అంబాసిడర్ కార్లకు ఇంకా ఆదరణ లభిస్తోంది. 1980లలో ఏటా 24,000 వరకూ అంబాసిడర్ కార్లు అమ్ముడుకాగా... 2000 సంవత్సరం తర్వాత ఈ సంఖ్య 6,000 లోపునకు పడిపోయింది. ప్లాంట్ నుంచి తాజాగా రోజుకు ఐదుకార్లు మాత్రమే బయటికి విడుదలయ్యాంటే వీటికి డిమాండ్ ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో చేసేదేమీలేక కంపెనీ వీటి తయారీకి ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
‘ఆంబి’ అని ముద్దుపేరుతో ప్రాచుర్యం పొందిన అంబాసిడర్ కార్ హుందాకు ప్రతిరూపంగా నిలిచింది. ఆకట్టుకునే రూపం, శక్తివంతమైన ఇంజిన్, భద్రతపై భరోసా... ఇవన్నీ అంబాసిడర్‌ను చూస్తే గుర్తుకొచ్చేవి. ఇలాంటి అంబాసిడర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.
హిందూస్తాన్ 10 పేరుతో హిందుస్తాన్ మోటార్స్ తొలి అంబాసిడర్‌ను ఉత్పత్తి చేసింది. ఈ కారుతో కంపెనీకి ఇబ్బడిముబ్బడిగా లాభాలొచ్చాయి.
భారత రోడ్లకు రారాజుగా అంబాసిడర్‌ను అభివర్ణిస్తారు. ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనక వైపు డ్రమ్ బ్రేక్‌లు కారణంగా ఈ కారు ప్రయాణం అత్యంత భద్రమైనది. సౌకర్యంగా కూర్చునేలా విశాలమైన సీట్‌లు ఈ కారు ప్రత్యేకత.
సంవత్సరాల తరబడి డిజైన్ అలాగే ఉన్నా.. ఇంటీరియర్ ఇతరత్రా పలు మార్పులను అంబాసిడర్ చూసింది. డాష్‌బోర్డ్‌లు, టెయిల్ లైట్లు, పార్కింగ్ లైట్లు ఇందులో కొన్ని.
1957 నుంచి రోడ్లపై ప్రయాణం ప్రారంభించిన అంబాసిడర్ కారులో... మోరిస్ ఆక్స్‌ఫర్డ్ నుంచి అంబాసిడర్ ఎన్‌కోర్‌వరకూ ఎన్నో మోడళ్లు వచ్చాయి.
ట్యాక్సీగా అంబాసిడర్ కారు చాలా ప్రాచుర్యం పొందింది. ఒక్క ముంబైలోనే 75 వేల అంబాసిడర్ ట్యాక్సీలు ఉండేవి.
1980 వరకూ భారత్‌లో అమ్ముడయ్యే ప్రతీ కారు అంబాసిడర్ కారే కావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. 2004లో 90 వేలకు పైగా అంబాసిడర్ కార్లు ఉత్పత్తయ్యాయి. ఇదొక రికార్డ్. అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో అంబాసిడర్ ప్రాభవం మసకబారడం మొదలైంది.
కొద్ది నెలల క్రితమే టాప్‌గేర్ ప్రోగ్రామ్‌లో అన్ని ప్రఖ్యాతిగాంచిన కార్లన్నింటినీ తోసిరాజని అంబాసిడర్... టాప్ ట్యాక్సీ కార్‌గా నిలిచింది.