
కారు కొనేముందు డిజిటల్ టచ్
► ఆటోమొబైల్ రంగంపై ప్రభావం
► కీలకంగా సామాజిక మాధ్యమాలు
► చేంజింగ్ గేర్స్ 2020 నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడ్జెట్‌కు తగ్గట్టుగా ఏ కారు కొనాలి.. ఏ మోడల్‌కు బెస్ట్ రేటింగ్ ఉంది. ఆ కారును వాడుతున్నవారు ఏమనుకుంటున్నారు వంటి విషయాలపై స్మార్ట్ కస్టమర్లు డిజిటల్ మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ అంశమే ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ రంగం స్వరూపాన్ని మార్చేస్తున్నది. భారత్‌లో 2020 నాటికి 70% వాహన అమ్మకాలపై డిజిటల్ ప్రభావం ఉంటుందని ‘చేంజింగ్ గేర్స్ 2020’ నివేదిక చెబుతోంది.
భారత వాహన రంగంలో డిజిటల్ మాధ్యమాల ప్రభావంపై కన్సల్టింగ్ రంగంలో ఉన్న బెయిన్ అండ్ కంపెనీ, ఫేస్‌బుక్‌తో కలసి చేపట్టిన అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 20 శాతం వాహన కొనుగోళ్లపై సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. మూడేళ్లలో ఈ సామాజిక మాధ్యమాల పాత్ర రెట్టింపు అవుతుందని అధ్యయనం చెబుతోంది. 35 ఏళ్లలోపు యువతే డిజిటల్‌కు మొగ్గుచూపుతుండటం విశేషం. 80 శాతం మంది కస్టమర్లు ఆన్‌లైన్ రీసెర్చ్ అంతా స్మార్ట్‌ఫోన్లో చేసేస్తున్నారట.
అంతా డిజిటల్‌మయం..
దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ వాడకం విస్తృతంకావడం....వాహన వినియోగదార్లపై అమితంగా ప్రభావం చూపిస్తాయని చేంజింగ్ గేర్స్ 2020 నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రూ.1,17,000 కోట్ల వ్యాపారంపై డిజిటల్ తన సత్తా చూపిస్తోంది. 2020 నాటికి ఇది రూ.2.60 లక్షల కోట్ల వ్యాపారాన్ని ప్రభావితం చేయనుంది. స్మార్ట్ వినియోగదార్ల సంఖ్యపరంగా దేశంలో హైదరాబాద్ టాప్–5లో ఉంటుందని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్‌దేవ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
పరిశోధన చేయాల్సిందే..
బెయిన్ అండ్ కంపెనీ, ఫేస్‌బుక్ బృందం 1,551 మంది భారతీయ కస్టమర్లను అధ్యయనం చేసింది. 87 మంది డీలర్లు, ఆటోమొబైల్ కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్ టీమ్‌తోపాటు యూఎస్, యూకే, జర్మనీ, చైనాకు చెందిన కస్టమర్లను సైతం ఇందులో భాగస్వామ్యం చేశారు. వాహన పరిశ్రమ, కస్టమర్ల తీరులో అనూహ్య మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. 48 శాతం వినియోగదార్లు వాహనాన్ని కొనే ముందు డిజిటల్ చానళ్లలో పరిశోధన చేస్తున్నారట.
ఈ సంఖ్య మూడేళ్లలో 70 శాతానికి చేరనుంది. కస్టమర్లు వాహనం కొన్న తర్వాత వారి అనుభవాన్నీ డిజిటల్ వేదికగా పంచుకుంటున్నారు. ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ద్వారా కంపెనీలతోపాటు డీలర్లతోనూ టచ్‌లో ఉంటున్నారు. బ్రాండ్ ఎంపికలో 45 శాతం మందిపై డిజిటల్ ముఖ్య భూమిక పోషిస్తోంది. 2020 కల్లా ఇది 60 శాతానికి చేరనుంది. విక్రయానంతర సేవలపైనా డిజిటల్ ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం సర్వీస్ బుక్ చేసుకునేందుకు 14 శాతం మంది, విడిభాగాల కొనుగోలుకు 8 శాతం మంది ఆన్‌లైన్‌పై ఆధారపడ్డారు. ఈ సంఖ్య 2020 నాటికి వరుసగా 40, 30 శాతానికి చేరనుంది.
డీలర్ దగ్గరకు రాకముందే..
పరిశోధనలో పాలుపంచుకున్న వినియోగదార్లలో డీలర్ వద్దకు వెళ్లకముందే డిజిటల్ ఆసరాగా 81 శాతం మంది తాము కొనబోయే కారుకు ఇంత వెచ్చించాలి అని నిర్ణయం తీసుకున్నారట. 72 శాతం మంది బ్రాండ్, 49% మంది మోడల్, 40 శాతం మంది వేరియంట్‌ను ఆన్‌లైన్లోనే ఎంచుకున్నారు.
వర్చువల్ రియాలిటీ ఆధారిత టెస్ట్ డ్రైవ్‌కు మూడింట రెండొంతుల మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక వాహన రంగ కంపెనీలు ప్రకటనలకు చేస్తున్న ఖర్చులో డిజిటల్ యాడ్ వ్యయాలు ఇప్పుడు 11 శాతమున్నాయి. ఇది మూడేళ్లలో 30 శాతానికి చేరనుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు తమ డీలర్‌షిప్ కేంద్రాల రూపురేఖలను మారుస్తున్నాయి. ఖరీదైన లొకేషన్లలో అత్యాధునిక ఔట్‌లెట్లు కొలువుదీరుతున్నాయి. స్టోర్లలో టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి.
యాప్ ఆధారిత ట్యాక్సీలకు..
కొత్త తరం మొబిలిటీ మోడళ్లకు కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తోంది. కీలక కస్టమర్లలో 40 శాతం మంది వారంలో మూడు నాలుగుసార్లు యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలను వినియోగించుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో మంచి వృద్ధి ఉండనుందని అధ్యయనం చెబుతోంది. యాప్ ఆధారిత ట్యాక్సీలు తిరుగుతున్న నగరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఒక్కో వ్యక్తి సగటున 3.3 రైడ్స్ చేస్తున్నారట. చైనాలో ఇది 17.1 రైడ్స్ ఉంది. భారత్‌లో ప్రస్తుతం 131 నగరాల్లో యాప్ ఆధారిత ట్యాక్సీలు పరుగెడుతున్నాయి. గతేడాది ప్రతి వారం 1.3 కోట్ల రైడ్స్ నమోదయ్యాయంటే ఆశ్చర్యమేయక మానదు.