ఆటోమొబైల్‌ రంగంలో సత్తా చాటుతున్న వనితలు | 64 per cent of women are working in Automobile manufacturing plants | Sakshi
Sakshi News home page

ఆటోమొబైల్‌ రంగంలో సత్తా చాటుతున్న వనితలు

Published Tue, Aug 2 2022 4:13 AM | Last Updated on Tue, Aug 2 2022 10:03 AM

64 per cent of women are working in Automobile manufacturing plants - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్‌ ఆటో, హీరో మోటో కార్ప్‌ చర్యలు తీసుకోవడం హర్షణీయం.

టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్‌ ఫ్లోర్‌లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్‌ ఉంది. టాటా మోటార్స్‌ పుణె ప్యాసింజర్‌ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది.

2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్‌ చీఫ్‌ హ్యుమన్‌ రీసోర్సెస్‌ ఆఫీసర్‌ రవీంద్ర కుమార్‌ తెలిపారు.  

ఎంజీ మోటార్‌ ఆదర్శనీయం..  
ఎంజీ మోటార్‌ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్‌ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్‌ నాణ్యత, సర్ఫెస్‌ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది.

జనరల్‌ మోటార్స్‌ నుంచి 2017లో హలోల్‌ ప్లాంట్‌ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్‌ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌) యశ్వింద్‌ పాటియాల్‌ తెలిపారు.  

హీరో మోటోలో 9.3 శాతం
ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్‌ ఆటో చకాన్‌ ప్లాంట్‌లో డోమినార్‌ 400, ఆర్‌ఎస్‌ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది.

2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్‌ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్‌మెంట్లు, విద్య,  శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.  

సవాళ్లు..
తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్‌  చీఫ్‌ హ్యుమన్‌ రీసోర్సెస్‌ ఆఫీసర్‌ రవీంద్ర కుమార్‌ వివరించారు. ‘‘ఆటోమొబైల్‌ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement