మార్కెట్ లీడర్ ఓలాకు బజాజ్, టీవీఎస్, హీరో సవాల్
రూ. లక్ష లోపు కొత్త మోడళ్లతో హల్‌చల్
ఓలా ఎలక్ట్రిక్ ఆధిపత్యానికి భారీ గండి...
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా జూలై నెలలో సేల్స్ దాదాపు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. మరోపక్క, ఈ విభాగంలో పోటీ ఫాస్ట్ చార్జింగ్ అవుతోంది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. ధరల యుద్ధానికి తెరతీసి, ఓలా మార్కెట్ వాటాకు గండికొడుతున్నాయి. ఐపీఓ సక్సెస్‌తో దండిగా నిధుల జోష్‌లో ఉన్న ఓలా.. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది!
ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,07,016 ఈ–టూవీలర్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన 54,616 వాహనాలతో పోలిస్తే 96 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 79,868 మాత్రమే. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సేల్స్ మళ్లీ ఎలక్ట్రిక్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పెట్రోలు టూవీలర్లలో రారాజులుగా ఉన్న సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో సైతం ఎలక్ట్రిక్ బరిలో తగ్గేదేలే అంటూ కాలుదువ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలైలో బజాజ్ ఆటో ఏకంగా 17,642 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం విశేషం. జూన్‌తో పోలిస్తే 80 శాతం సేల్స్ పెరిగాయి. మార్కెట్ వాటా సైతం 11.6 శాతం నుంచి 16.9 శాతానికి జంప్ చేసింది. ఇక టీవీఎస్ అమ్మకాలు 30 శాతం పైగా ఎగబాకి 19,471 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడ్డ హీరో మోటో 5,044 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సత్తా చాటింది. మొత్తంమీద చూస్తే, ఈ మూడు దిగ్గజాల ‘ఎలక్ట్రిక్’ వాటా 40 శాతానికి పైగా ఛార్జింగ్ అయింది. ఇందులో టీవీఎస్, బజాజ్ వాటాయే దాదాపు 35 శాతం గమనార్హం.
ఓలాకు షాక్...
రెండు నెలల క్రితం, మే నెలలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో తిరుగులేని స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ సెగ బాగానే తగులుతోంది. జూన్‌లో కంపెనీ 36,781 వాహనాలు విక్రయించగా.. జూలైలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడి 41,597కు చేరింది. అయితే, మార్కెట్ వాటా మాత్రం జూన్‌లో 47.5 శాతానికి, ఆపై జూలైలో ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఓలాకు తగ్గుతున్న మార్కెట్ వాటాను సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేగంతో కొట్టేస్తున్నాయి. మరోపక్క, పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఏథర్ ఎనర్జీ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. జూన్‌లో 6,189 (8% మార్కెట్ వాటా), జూలైలో 10,080 (10% వాటా) వాహనాలను అమ్మింది. అయితే, దీని స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రూ. లక్ష లోపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుండటంతో.. ఓలా, ఏథర్ వంటి పూర్తి ఈవీ కంపెనీలు కూడా ధరల యుద్ధంలోకి దూకాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాటా పతనంతో ఓలా ఇక పూర్తిగా ఈ–టూవీలర్లపైనే దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.
భారీ నెట్‌వర్క్, సర్వీస్ ప్లస్..
తొలిసారిగా రూ. లక్ష లోపు స్కూటర్లను ప్రవేశపెట్టడం కూడా బజాజ్, టీవీఎస్, హీరో అమ్మకాలు పుంజుకున్నాయి. ‘ఈ 3 సాంప్రదాయ టూవీలర్ కంపెనీలకు విస్తృత డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్, బ్రాండ్ విలువ, సర్వీస్ సదుపాయాలు దన్నుగా నిలుస్తున్నాయి.మార్కెట్ వాటాను కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని రీసెర్చ్ సంస్థ నోమురా ఆటోమోటివ్ రిటైల్ విభాగం హెడ్ హర్షవర్ధన్ శర్మ పేర్కొన్నారు. ధరల పోరు, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటివి ఈ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. తాజా పరిణామాలతో ఛార్జింగ్ స్టేషన్ల భారీ పెరుగుదలతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాలు జోరందుకుంటాయని, వినియోగదారులకు కూడా ఇది మేలు చేకూరుస్తుందని హర్షవర్ధన్ చెప్పారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment