కష్టకాలంలో టాటాలను కామధేనువుగా ఆదుకున్న జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్)... ఇప్పుడు నష్టాలతో ఎదురీదుతోంది. బ్రెగ్జిట్ గండానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ మందగమనం... జేఎల్‌ఆర్ అమ్మకాలకు గండికొడుతోంది. దీంతో మాతృసంస్థ టాటా మోటార్స్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకపక్క దేశీయంగా డిమాండ్ పడిపోయి.. విక్రయాలు కుదేలవుతున్న తరుణంలో అక్కరకొస్తుందనుకున్న జేఎల్‌ఆర్ కూడా చతికిలపడటంతో టాటా మోటార్స్‌ను కష్టాల ఊబిలోకి నెడుతోంది. జేఎల్‌ఆర్‌లో పెట్టుబడుల విలువ తరిగిపోయే పరిస్థితికి దారితీస్తోంది.
టాటా మోటార్స్ షేరు పతనం రూపంలో ఇన్వెస్టర్లకు ఇది కనిపిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో జేఎల్‌ఆర్‌ను టాటాలు వదిలించుకోవడం మంచిదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ ఈ అంశాన్ని పేర్కొంది. జేఎల్‌ఆర్ విక్రయం టాటా మోటార్స్‌కు కనకవర్షం కురిపిస్తుందని లెక్కలేస్తోంది. మరి ఎవరికి విక్రయించాలంటారా? జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకు అమ్మేస్తే ఇరు సంస్థలకు మేలు అనేది బెర్న్‌స్టీన్ వాదన. అంతేకాదు జేఎల్‌ఆర్‌కు 9 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ.82 వేల కోట్లు)భారీ విలువను కూడా కట్టింది. బీఎండబ్ల్యూకు జేఎల్‌ఆర్ మంచి వ్యాపార అవకాశం అవుతుందని ఈ సంస్థ అభిప్రాయపడింది. తన క్లయింట్లకు బెర్న్‌స్టీన్ పంపిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.
బీఎండబ్ల్యూకు కలిసొస్తుంది...
బీఎండబ్ల్యూ దగ్గర నిధులు దండిగా ఉన్నాయని, అదే సమయంలో తన బ్రాండ్, ఉత్పత్తుల వృద్ధికి అవకాశాలు పరిమితంగానే ఉన్నట్టు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో విస్తరణపై నిధులు ఖర్చు చేసినా, రాబడులు ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడింది. సొంతంగా విలువను సృష్టించే అవకాశం ఈ స్థాయి నుంచి పరిమితమేనని పేర్కొంది. జేఎల్‌ఆర్‌ను దాని పుస్తక విలువ కంటే తక్కువకే సొంతం చేసుకోవాలని, బీఎండబ్ల్యూ సహకారంతో లాభదాయకంగా జేఎల్‌ఆర్ అవతరించగలదని ఈ నివేదికలో వివరించింది. గణనీయమైన విలువను సృష్టించుకోవచ్చని, బీఎండబ్ల్యూ ఎర్నింగ్స్ (ఆదాయాలు) 20 శాతం వరకు పెంచుకోవచ్చని సూచించింది.
టాటాలకూ మేలు చేస్తుంది...
జేఎల్‌ఆర్ వ్యాపారపరంగా ఉన్న సమస్యలు టాటా గ్రూపును ఇబ్బంది పెడుతున్నట్టు బెర్న్‌స్టీన్ పేర్కొంది. జేఎల్‌ఆర్‌కు వ్యూహాత్మక పరిష్కారాన్ని టాటా గ్రూపు గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జేఎల్‌ఆర్ అమ్మకం రూపంలో వచ్చే 9 బిలియన్ పౌండ్ల(11.23 బిలియన్ డాలర్లు)తో, షేరు ధర మళ్లీ పైకి వెళ్లగలదని అంచనా వేసింది. అయితే, ఈ నిధులను కంపెనీ తిరిగి ఏ విధంగా వినియోగంలోకి తీసుకొస్తుందన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. 2008లో జేఎల్‌ఆర్‌ను టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
అంటే 1.84 బిలియన్ పౌండ్లు (ప్రస్తుత మారకం విలువ ప్రకారం సుమారు రూ.16,376 కోట్లు). బెర్న్‌స్టీన్ లెక్కగట్టిన అంచనా ప్రకారం కొనుగోలు విలువకు ఐదు రెట్ల విలువ దక్కినట్లు లెక్క. అంటే ఇది ఒకరకంగా టాటా మోటార్స్ రుణ భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. జూన్ క్వార్టర్ నాటికి టాటా మోటార్స్ మొత్తం రుణ భారం రూ.46,500 కోట్లకు పేరుకుపోయింది. ఇదే తరుణంలో జూన్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్(జేఎల్‌ఆర్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపితే) నికర నష్టం రెట్టింపై రూ.3,679 కోట్లకు చేరడం కూడా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
భాగస్వామ్యంతో ఊహాగానాలు...
ఈ ఏడాది జూలైలో బీఎండబ్ల్యూతో టాటా మోటార్స్ చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు జట్టుకట్టింది. దీంతో నాటి నుంచి జేఎల్‌ఆర్‌ను బీఎండబ్ల్యూ కొనుగోలు చేయవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ దిశగా అడుగులు.. ఇరు కంపెనీలకు ప్రయోజనకరమని బెర్న్‌స్టీన్ నివేదిక విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. బీఎండబ్ల్యూ ఇప్పటికే ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్లు, ఇంజిన్లను జేఎల్‌ఆర్‌కు సరఫరా చేసేందుకు అంగీకరించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. అయితే, జేఎల్‌ఆర్‌లో వాటాల విక్రయమై బీఎండబ్ల్యూతో చర్చల వార్తలను టాటా మోటార్స్ ఖండించింది.
పాత యజమాని చెంతకే!
జాగ్వార్, ల్యాండ్‌రోవర్ బ్రాండ్‌లు.. బ్రిటన్‌లోనే పురుడుపోసుకున్నాయి. ఇవి రెండూ 1968 వరకూ స్వతంత్ర కంపెనీలుగానే కొనసాగాయి. అయితే, 1968లో జాగ్వార్, ల్యాండ్‌రోవర్‌లు విలీనమాయ్యయి. వీటిని కొనుగోలు చేసిన బ్రిటిష్ లేలాండ్ 1984 వరకూ కొనసాగించింది. ఆ తర్వాత మళ్లీ రెండు కంపెనీలూ బ్రిటిష్ లేలాండ్ నుంచి విడిపోయాయి. జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకి అనుబంధ సంస్థలుగా మారాయి. అమెరికా కార్ల దిగ్గజం ఫోర్డ్... 1989లో జాగ్వార్ కార్స్‌ను, 2000లో ల్యాండ్‌రోవర్‌ను చేజిక్కించుకుంది. దీంతో మళ్లీ ఫోర్డ్ నేతృత్వంలో జాగ్వార్‌ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) ఒకే సంస్థగా ఆవిర్భవించాయి. అయితే, 2008లో ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడిన ఫోర్డ్ మోటార్స్... జేఎల్‌ఆర్‌ను అమ్మకానికి పెట్టింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న టాటా మోటార్స్ 2008లో 2.3 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ జేఎల్‌ఆర్‌ను పాత యజమాని బీఎండబ్ల్యూ కొనొచ్చన్న వార్తలు జోరందుకున్నాయి.
టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?
Published Fri, Oct 4 2019 4:44 AM | Last Updated on Fri, Oct 4 2019 4:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment