Jaguar Land Rover
-
టాటా మోటార్స్ లాభం జంప్
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024–25, క్యూ1)లో బంపర్ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 74 శాతం జంప్ చేసి రూ. 5,566 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,204 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా దేశీ వాహన వ్యాపారంతో పాటు జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్ఆర్) పటిష్టమైన పనితీరు ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,03,597 కోట్ల నుంచి రూ. 1,09,623 కోట్లకు వృద్ధి చెందింది. స్టాండెలోన్ ప్రాతిపదికన (దేశీ కార్యకలాపాలు) క్యూ1లో కంపెనీ రూ. 2,190 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 64 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 16,132 కోట్ల నుంచి రూ. 18,851 కోట్లకు పెరిగింది. ఇక జూన్ క్వార్టర్లో జేఎల్ఆర్ ఆదాయం కొత్త రికార్డులను తాకింది. 5 శాతం వృద్ధితో 7.3 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది. టాటా మోటార్స్ షేరు ధర 1 శాతం లాభపడి రూ.1,145 వద్ద ముగిసింది. కంపెనీ విభజనకు బోర్డు ఓకే... టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడగొట్టే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం, టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) నుంచి వాణిజ్య వాహన వ్యాపారాన్ని టాటా మోటార్స్ సీవీగా విభజిస్తారు. ప్రస్తుత పీవీ వ్యాపారం టీఎంఎల్లో విలీనం అవుతుంది. విభజన తర్వాత టీఎంఎల్‌సీవీ, టీఎంఎల్ పేర్ల మార్పుతో పాటు రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తయ్యేందుకు 12–15 నెలలు పట్టొచ్చని వెల్లడించింది. -
మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
ముంబై: మేడిన్ ఇండియా రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు కొద్ది రోజుల్లో భారత రోడ్లపై పరుగు తీయనున్నాయి. దేశీయంగా వీటి తయారీ చేపట్టాలని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ నిర్ణయించింది. 54 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ మోడళ్లు యూకే వెలుపల ఒక దేశంలో తయారు కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యూకేలోని సోలహల్ వద్ద ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంటులో తయారైన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా 121 మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా తయారైతే ఈ రెండు మోడళ్ల ధర 18–22 శాతం తగ్గనుందని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. టాటా మోటార్స్‌కు చెందిన పుణే ప్లాంటులో ఇప్పటికే రేంజ్ రోవర్ వెలార్, రేంజ్ రోవర్ ఇవోక్, జాగ్వార్ ఎఫ్–పేస్, డిస్కవరీ స్పోర్ట్ అసెంబుల్ అవుతున్నాయి. 2023–24లో దేశవ్యాప్తంగా జేఎల్ఆర్ ఇండియా 4,436 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం అధికం. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై– సెపె్టంబర్(క్యూ2)లో రూ. 3,783 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 1,004 కోట్ల నికర నష్టం ప్రకటించింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) పనితీరు లాభాలకు దోహదపడింది. వెరసి వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. ఆదాయం రూ. 79,611 కోట్ల నుంచి రూ. 1,05,128 కోట్లకు దూసుకెళ్లింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం రూ. 1,270 కోట్ల నికర లాభం సాధించగా.. గతేడాది క్యూ2 లో రూ. 293 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇకపై మరింత దూకుడు: తాజా సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 30 శాతం జంప్ చేసి 6.9 బిలియన్ పౌండ్లకు చేరింది. హోల్‌సేల్ అమ్మకాలు, కొత్త ప్రొడక్టులు, వ్యయ నియంత్రణలు, డిమాండుకు అనుగుణమైన పెట్టుబడులు ఇందుకు సహకరించాయి. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో హోల్‌సేల్ అమ్మకాలు క్రమంగా జోరందుకోనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. నిర్వహణ(ఇబిట్) మార్జిన్లు గత 6 శాతం అంచనాలకంటే అధికంగా 8 శాతాన్ని తాకవచ్చని భావిస్తోంది. ఈ ఏడాది 2 బిలియన్ పౌండ్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను సాధించగలదని ఆశిస్తోంది. వెరసి మార్చికల్లా నికర రుణ భారం బిలియన్ పౌండ్లకంటే దిగువకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 1.5% బలపడి రూ. 637 వద్ద ముగిసింది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పరిశీలిస్తున్నాం...
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు (బీఈవీ) గల డిమాండ్‌ను పరిశీలిస్తోంది. తదనుగుణంగా మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టడానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోనుంది. జేఎల్ఆర్ ప్రస్తుతం జాగ్వార్ భారత్‌లో ఐ–పేస్ అనే ఏకైక ఎలక్ట్రిక్ మోడల్‌ను విక్రయిస్తోంది. జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా లగ్జరీ వాహనాల సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లో విక్రయాల వృద్ధి అత్యంత మెరుగ్గా ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1,048 యూనిట్ల విక్రయాలతో అత్యుత్తమ పనితీరు కనపర్చినట్లు పేర్కొన్నారు. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించే పనిలో ఉన్నట్లు రాజన్ వివరించారు. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 సేల్స్ అవుట్‌లెట్స్, 27 సరీ్వస్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జేఎల్ఆర్ ఇటీవలే కొత్త రేంజ్ రోవర్ వేలార్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 94.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే వేలార్‌కు 750 బుకింగ్స్ వచ్చాయని, ఏటా 1,500 యూనిట్ల మేర అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు. -
జేఎల్ఆర్ రూ.1,53,450 కోట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వచ్చే అయిదేళ్లలో రూ.1,53,450 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. విస్తరణ, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం, కార్లకు సాంకేతికత జోడించడం కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్టు వెల్లడించింది. యూకేలోని హేల్‌వుడ్ ప్లాంటు పూర్తి ఎలక్ట్రిక్ మోడళ్ల తయారీ కేంద్రం కానుందని తెలిపింది. ప్రస్తుతం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లను తయారు చేస్తున్న వోవహాంప్టన్ ప్లాంటులో ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్లను ఉత్పత్తి చేస్తారు. అలాగే ఈ కేంద్రాన్ని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌గా పేరు మార్చనున్నారు. మధ్యస్థాయి ఆధునిక లగ్జరీ ఎస్యూవీ పూర్తి ఎలక్ట్రిక్ రూపంలో రానున్నట్టు జేఎల్ఆర్ వెల్లడించింది. ఈ ఏడాదే క్లయింట్ల నుంచి ఆర్డర్లు స్వీకరించనున్నట్టు తెలిపింది. డెలివరీలు 2025 నుంచి మొదలు కానున్నాయి. పురోగతి సాధించాం.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 2030 నాటికి ఆధునిక లగ్జరీ కార్ బ్రాండ్‌గా నిలవాలన్న లక్ష్యాన్ని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆడ్రియన్ మార్డెల్ పునరుద్ఘాటించారు. 2024–25 నాటికి రుణ రహిత, 2026 నాటికి రెండంకెల ఎబిటా స్థాయికి చేరుకుంటామన్నారు. ‘విలాసవంత వ్యాపారం కోసం పర్యావరణ, సామాజిక, కమ్యూనిటీ ప్రభావంలో కొత్త బెంచ్‌మార్క్‌ను రూపొందించడానికి రెండేళ్ల క్రితం వ్యూహాన్ని రచించాం. నాటి నుంచి చాలా పురోగతి సాధించాం. ఇందులో భాగంగా విమర్శకుల ప్రశంసలు పొందిన రెండు కొత్త ఆధునిక లగ్జరీ రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లను ఆవిష్కరించాం. రికార్డు స్థాయిలో వీటికి డిమాండ్ ఉంది. మహమ్మారి, చిప్ కొరత సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించాం. మూడవ త్రైమాసికంలో లాభాలను ఆర్జించేందుకు.. లాభదాయకత ఉన్న మోడళ్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని వివరించారు. -
జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవో రాజీనామా, ఎందుకంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) సీఈవో థియరీ బొల్లోర్ తన పదవికి రాజీనామా చేశారు. థియరీ బొల్లోర్ రిజైన్‌పై జాగ్వార్ పేరెంట్ కంపెనీ టాటా ప్రకటించింది.అయితే వ్యక్తిగత కారణాల వల్లే జేఎల్ఆర్కు రిజైన్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. బొల్లోర్ జాగ్వార్లో డిసెంబర్ 31వరకు కొనసాగనున్నారు. రాజీనామా సందర్భంగా బొల్లోర్ మాట్లాడుతూ..‘గత రెండు సంవత్సరాలుగా జాగ్వార్ ల్యాండ్ రోవర్లో సాధించిన విజయాలపై గర్వరపడుతున్నాం.వారి అంకితభావం, అభిరుచికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తం సంస్థ భవిష్యత్తు మరింత ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. బొల్లోర్ సేవలు అమోఘం టాటా సన్స్, టాటా మోటార్స్, జేఎల్ఆర్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ..‘జాగ్వార్ ల్యాండ్ రోవర్లో బొల్లోర్ సేవల్ని మరువలేం. ఆందుకు ఆయనకు కృతజ్ఞతలు. విజయవంతమైన సంస్థగా పరిణితి చెందేలా పటిష్టమైన పునాదులు నిర్మించారని కొనియాడారు. తద్వారా కంపెనీ భవిష్యత్తు మరింత వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాత్కాలిక సీవోగా అడ్రియన్ మార్డెల్ 32 ఏళ్లుగా జేఎల్ఆర్లో విధులు నిర్వహిస్తున్న అడ్రియన్ మార్డెల్ మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అయితే బొల్లోర్ జాగ్వార్‌కు రిజిగ్నేషన్ ఇవ్వడంతో నవంబర్ 16 నుంచి తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
జాగ్వార్ ల్యాండ్ రోవర్..డిస్కవరీ కొత్త ఎడిషన్ బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా సరికొత్త డిస్కవరీ ఎస్యూవీ మెట్రోపాలిటన్ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.26 కోట్ల నుంచి మొదలు. పి360 ఇంజెనియం పెట్రోల్ ఇంజన్, డి300 ఇంజెనియం డీజిల్ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. టాప్ వేరియంట్‌కు 31.24 సెంటీమీటర్ల ఇంటెరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ సిగ్నల్ బూస్టర్‌తో వైర్లెస్ చార్జింగ్, ఫోర్ జోన్క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ స్టీరింగ్ వీల్ వంటి హంగులు ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిస్కవరీ భారతీయ మార్కెట్లో అత్యంత బహుముఖ ఏడు సీట్ల ఎస్యూవీ అని కంపెనీ తెలిపింది. -
జేఎల్ఆర్ డిఫెండర్ 90 అమ్మకాలు షురూ, ధర ఎంతంటే..
Jaguar Land Rover Defender 90 ముంబై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన ఎస్యూవీ డిఫెండర్ 90 విక్రయాలను ప్రారంభించింది. గురువారం నుంచి అమ్మకాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. కారు ధర రూ.76.57 లక్షలుగా ఉంది. ఈ ఎస్యూవీ మూడు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. ఆరు సీట్ల సామర్థ్యం ఉంది. ‘‘గతేడాది మార్కెట్లోకి వచ్చిన డిఫెండర్ 110 మోడల్‌కు డిమాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు డిఫెండర్ 90 విడుదలతో ల్యాండ్ రోవర్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది’’ అని జేఎల్ఆర్ విభాగపు ఎండీ రోహిత్ తెలిపారు. -
జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల
లగ్జరీ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు జాగ్వార్ ఐ-పేస్‌ను భారత మార్కెట్ లో రూ.1.6 కోట్లకు విడుదల చేసింది. ఎస్యూవీ జాగ్వార్ ఐ-పేస్‌ను పూర్తిస్థాయి విద్యుత్తు కారుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. జాగ్వార్ ఐ-పేస్ 90 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 294 కిలోవాట్ల శక్తిని, 696 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఐ-పేస్ కేవలం 4.8 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత ఛార్జింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండటానికి దేశంలో 19 నగరాల్లో 22 రిటైల్ అవుట్లెట్లలో 35 ఈవీ ఛార్జర్లను అమర్చినట్లు సంస్థ తెలిపింది. ప్రతిచోట 7.4 కేడబ్ల్యూ ఏసీతో పాటు 25 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ రిటైల్ నెట్వర్క్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఇండియా జాగ్వార్ ల్యాండ్ రోవర్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి తెలిపారు. అలాగే, వినియోగదారులు వాహనంలో అందించిన హోమ్ ఛార్జింగ్ కేబుల్‌ను ఛార్జింగ్ కోసం 7.4 కిలోవాట్ల ఏసీ వాల్ మౌంటెడ్ ఛార్జర్‌ను ఉపయోగించవచ్చు. ఛార్జర్‌ని అమర్చడానికి టాటా పవర్ లిమిటెడ్ సిబ్బంది సహకరిస్తారని చెప్పింది. ఈ కారు కొనుగోలు చేస్తే ఐదేళ్ల సర్వీస్ ప్యాకేజీ, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ, ఎనిమిదేళ్ల లేదా 1.6 లక్షల కి.మీ వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. చదవండి: కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? -
టాటా మోటార్స్ : ఉద్యోగులపై వేటు
సాక్షి, ముంబై : కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో టాటా మోటార్స్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) యూనిట్లో ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. నష్టాలను పూడ్చుకునేందుకు, ఖర్చులు తగ్గింపు లక్ష్యంతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్లలో పనిచేస్తున్న1100 తాత్కాలిక ఉద్యోగులను జులైలో తొలగించనున్నామని కంపెనీ ప్రకటించింది. తద్వారా టాటా మోటార్స్ లగ్జరీ యూనిట్ జేఎల్ఆర్ 1 బిలియన్ పౌండ్ల (1.26 బిలియన్ డాలర్లు)ను పొదుపు చేయాలని భావిస్తోంది. (పదవ రోజూ పెట్రో షాక్) టాటా మోటార్స్ తన వ్యాపారాలన్నింటినీ సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 2021నాటికి దేశీయ వ్యాపారంలో 5 బిలియన్ పౌండ్లను ఆదా చేయాలని భావిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ తెలిపారు. ఇందులో 3.5 బిలియన్ పౌండ్లను ఇప్పటికే సాధించామని చెప్పారు. అలాగే గత ఏడాది 3 బిలియన్ పౌండ్లతో పోలిస్తే మూలధన వ్యయాన్ని 2.5 బిలియన్ పౌండ్లకు తగ్గించనుంది. అయితే తమ అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనా సహా యూరప్, అమెరికాలో ల్యాండ్ రోవర్ స్పోర్ట్-యుటిలిటీ వెహికల్ డిఫెండర్, రేంజ్ రోవర్ ఎవోక్ అమ్మకాలు పుంజుకునే సంకేతాలున్నా యని బాలాజీ చెప్పారు. (టాటా మోటార్స్ నష్టాలు 9,864 కోట్లు) కరోనా, లాక్డౌన్ కారణంగా తమ లగ్జరీ కార్ల విక్రయాలు 30.9 శాతం తగ్గాయని జెఎల్ఆర్ ప్రకటించింది. టాటా మోటార్స్ ఆదాయంలో కీలకమైన జేఎల్ఆర్ ఆదాయం మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 27.7 శాతం క్షీణించినట్టు తెలిపింది. మరోవైపు 2010 నుండి జేఎల్ఆర్ బాస్ గా కొనసాగుతున్న రాల్ఫ్ స్పేత్ ఈ సెప్టెంబరులో పదవినుంచి తప్పుకోనున్నారు. -
టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?
కష్టకాలంలో టాటాలను కామధేనువుగా ఆదుకున్న జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)... ఇప్పుడు నష్టాలతో ఎదురీదుతోంది. బ్రెగ్జిట్ గండానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ మందగమనం... జేఎల్ఆర్ అమ్మకాలకు గండికొడుతోంది. దీంతో మాతృసంస్థ టాటా మోటార్స్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకపక్క దేశీయంగా డిమాండ్ పడిపోయి.. విక్రయాలు కుదేలవుతున్న తరుణంలో అక్కరకొస్తుందనుకున్న జేఎల్ఆర్ కూడా చతికిలపడటంతో టాటా మోటార్స్‌ను కష్టాల ఊబిలోకి నెడుతోంది. జేఎల్ఆర్లో పెట్టుబడుల విలువ తరిగిపోయే పరిస్థితికి దారితీస్తోంది. టాటా మోటార్స్ షేరు పతనం రూపంలో ఇన్వెస్టర్లకు ఇది కనిపిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో జేఎల్ఆర్ను టాటాలు వదిలించుకోవడం మంచిదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ ఈ అంశాన్ని పేర్కొంది. జేఎల్ఆర్ విక్రయం టాటా మోటార్స్‌కు కనకవర్షం కురిపిస్తుందని లెక్కలేస్తోంది. మరి ఎవరికి విక్రయించాలంటారా? జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకు అమ్మేస్తే ఇరు సంస్థలకు మేలు అనేది బెర్న్‌స్టీన్ వాదన. అంతేకాదు జేఎల్ఆర్కు 9 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ.82 వేల కోట్లు)భారీ విలువను కూడా కట్టింది. బీఎండబ్ల్యూకు జేఎల్ఆర్ మంచి వ్యాపార అవకాశం అవుతుందని ఈ సంస్థ అభిప్రాయపడింది. తన క్లయింట్లకు బెర్న్‌స్టీన్ పంపిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూకు కలిసొస్తుంది... బీఎండబ్ల్యూ దగ్గర నిధులు దండిగా ఉన్నాయని, అదే సమయంలో తన బ్రాండ్, ఉత్పత్తుల వృద్ధికి అవకాశాలు పరిమితంగానే ఉన్నట్టు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో విస్తరణపై నిధులు ఖర్చు చేసినా, రాబడులు ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడింది. సొంతంగా విలువను సృష్టించే అవకాశం ఈ స్థాయి నుంచి పరిమితమేనని పేర్కొంది. జేఎల్ఆర్ను దాని పుస్తక విలువ కంటే తక్కువకే సొంతం చేసుకోవాలని, బీఎండబ్ల్యూ సహకారంతో లాభదాయకంగా జేఎల్ఆర్ అవతరించగలదని ఈ నివేదికలో వివరించింది. గణనీయమైన విలువను సృష్టించుకోవచ్చని, బీఎండబ్ల్యూ ఎర్నింగ్స్ (ఆదాయాలు) 20 శాతం వరకు పెంచుకోవచ్చని సూచించింది. టాటాలకూ మేలు చేస్తుంది... జేఎల్ఆర్ వ్యాపారపరంగా ఉన్న సమస్యలు టాటా గ్రూపును ఇబ్బంది పెడుతున్నట్టు బెర్న్‌స్టీన్ పేర్కొంది. జేఎల్ఆర్కు వ్యూహాత్మక పరిష్కారాన్ని టాటా గ్రూపు గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జేఎల్ఆర్ అమ్మకం రూపంలో వచ్చే 9 బిలియన్ పౌండ్ల(11.23 బిలియన్ డాలర్లు)తో, షేరు ధర మళ్లీ పైకి వెళ్లగలదని అంచనా వేసింది. అయితే, ఈ నిధులను కంపెనీ తిరిగి ఏ విధంగా వినియోగంలోకి తీసుకొస్తుందన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. 2008లో జేఎల్ఆర్ను టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అంటే 1.84 బిలియన్ పౌండ్లు (ప్రస్తుత మారకం విలువ ప్రకారం సుమారు రూ.16,376 కోట్లు). బెర్న్‌స్టీన్ లెక్కగట్టిన అంచనా ప్రకారం కొనుగోలు విలువకు ఐదు రెట్ల విలువ దక్కినట్లు లెక్క. అంటే ఇది ఒకరకంగా టాటా మోటార్స్ రుణ భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. జూన్ క్వార్టర్ నాటికి టాటా మోటార్స్ మొత్తం రుణ భారం రూ.46,500 కోట్లకు పేరుకుపోయింది. ఇదే తరుణంలో జూన్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్(జేఎల్ఆర్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపితే) నికర నష్టం రెట్టింపై రూ.3,679 కోట్లకు చేరడం కూడా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భాగస్వామ్యంతో ఊహాగానాలు... ఈ ఏడాది జూలైలో బీఎండబ్ల్యూతో టాటా మోటార్స్ చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు జట్టుకట్టింది. దీంతో నాటి నుంచి జేఎల్ఆర్ను బీఎండబ్ల్యూ కొనుగోలు చేయవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ దిశగా అడుగులు.. ఇరు కంపెనీలకు ప్రయోజనకరమని బెర్న్‌స్టీన్ నివేదిక విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. బీఎండబ్ల్యూ ఇప్పటికే ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్లు, ఇంజిన్లను జేఎల్ఆర్కు సరఫరా చేసేందుకు అంగీకరించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. అయితే, జేఎల్ఆర్లో వాటాల విక్రయమై బీఎండబ్ల్యూతో చర్చల వార్తలను టాటా మోటార్స్ ఖండించింది. పాత యజమాని చెంతకే! జాగ్వార్, ల్యాండ్‌రోవర్ బ్రాండ్లు.. బ్రిటన్‌లోనే పురుడుపోసుకున్నాయి. ఇవి రెండూ 1968 వరకూ స్వతంత్ర కంపెనీలుగానే కొనసాగాయి. అయితే, 1968లో జాగ్వార్, ల్యాండ్రోవర్లు విలీనమాయ్యయి. వీటిని కొనుగోలు చేసిన బ్రిటిష్ లేలాండ్ 1984 వరకూ కొనసాగించింది. ఆ తర్వాత మళ్లీ రెండు కంపెనీలూ బ్రిటిష్ లేలాండ్ నుంచి విడిపోయాయి. జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకి అనుబంధ సంస్థలుగా మారాయి. అమెరికా కార్ల దిగ్గజం ఫోర్డ్... 1989లో జాగ్వార్ కార్స్‌ను, 2000లో ల్యాండ్రోవర్ను చేజిక్కించుకుంది. దీంతో మళ్లీ ఫోర్డ్ నేతృత్వంలో జాగ్వార్ల్యాండ్రోవర్(జేఎల్ఆర్) ఒకే సంస్థగా ఆవిర్భవించాయి. అయితే, 2008లో ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడిన ఫోర్డ్ మోటార్స్... జేఎల్ఆర్ను అమ్మకానికి పెట్టింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న టాటా మోటార్స్ 2008లో 2.3 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ జేఎల్ఆర్ను పాత యజమాని బీఎండబ్ల్యూ కొనొచ్చన్న వార్తలు జోరందుకున్నాయి. -
కొత్త డిస్కవరీ స్పోర్ట్ ల్యాండ్‌మార్క్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కంపెనీ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారును 2–లీటర్ల ఇంజినీయమ్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని, ధర రూ.53.77 లక్షలని (ఎక్స్ షోరూమ్) అని జేఎల్ఆర్ తెలిపింది. ఈ కారులో స్పోర్టీ బంపర్, కార్పాథియన్ గ్రే కాంట్రాస్ట్ రూఫ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నా యని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎమ్డీ, రోహిత్ సూరి తెలిపారు. -
జేఎల్ఆర్కు ట్రేడ్‌వార్ సెగ
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు జూలైలో భారీ క్షీణతను నమోదుచేశాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్ఆర్ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఫెలిక్స్ బ్రౌటిగమ్ తెలిపారు. జాగ్వార్ బ్రాండ్ సేల్స్ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్ రోవర్ అమ్మకాలు 24 శాతం క్షీణించి 25,152 యూనిట్లుగా నిలిచినట్లు వెల్లడించారు. ‘కీలక మార్కెట్లలో గత నెల అమ్మకాలు క్లిష్టతరంగా మారాయి. చైనాలో రిటైల్ సేల్స్ 46.9 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తేలికపాటి వాహన పరీక్షా విధానంలో జాప్యం వల్ల బ్రిటన్‌లో అమ్మకాలు 18.3 శాతం తగ్గాయి. ఉత్తర అమెరికాలో 9.5 శాతం తగ్గుదల నమోదైంది. టారిఫ్ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని వివరించారు. వాణిజ్య యుద్ధం కారణంగా కొనుగోలుదారుల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారాయన. -
జేఎల్ఆర్ 2 కొత్త వేరియంట్లు
ముంబై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తాజాగా ఎస్‌యూవీలు రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్లలో అదనపు ఫీచర్లతో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుత మోడళ్ల ధరలోనే ఈ కొత్త వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ డీజిల్ వేరియంట్ల ధర రూ.99.48– రూ.143 లక్షల శ్రేణిలో, పెట్రోల్ వేరియంట్ల ధర రూ. 110.03–రూ. 196.75 లక్షల శ్రేణిలో ఉంది. అలాగే కంపెనీ తన రేంజ్ రోవర్ డీజిల్ వేరియంట్ల ధరను రూ.174.29– రూ.376.61 లక్షల శ్రేణిలో, పెట్రోల్ వేరియంట్ల ధరను రూ.187.16– రూ.388.16 లక్షల శ్రేణిలో నిర్ణయించింది. రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ 2018 మోడళ్లలో ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్సన్, ట్విన్–స్పీడ్ ట్రాన్స్ఫర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. -
హ్యుందాయ్ ‘ఎలైట్ ఐ20’లో ఆటోమేటిక్ వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘ఎలైట్ ఐ20’లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. దీని ప్రారంభ ధర రూ.7.04 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. తాజా వేరియంట్ ద్వారా ప్రీమియం కాంపాక్ట్ విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లకు ఉన్న బలమైన డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. కాగా 2015లో 4 శాతంగా ఉన్న ప్రీమియం కాంపాక్ట్ విభాగంలోని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ల అమ్మకాలు, 2018 నాటికి 14 శాతానికి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్లలో పెట్రోల్ వేరియంట్లు న్యూఢిల్లీ: జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీలు డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్‌లో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ప్రారంభ ధర వరుసగా రూ.49.2 లక్షలు, రూ.51.06 లక్షలుగా ఉంది. ఈ రెండు వేరియంట్లలోనూ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఇంజీనియమ్ 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ‘‘రేంజ్ రోవర్ వెలార్‌లో ఇప్పటికే అధిక పనితీరు కనబరిచే ఇంజీనియమ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చాం. ఇప్పుడు ఇదే ఇంజిన్‌ను డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్లలోనూ అందుబాటులోకి తీసుకువచ్చాం’’ అని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి పేర్కొన్నారు. వీటిల్లో వై–ఫై హాట్‌స్పాట్ (4జీ యాక్సెస్‌తోపాటు 8 వరకు డివైస్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు) సహా పలు ఇతర ఫీచర్లను పొందుపరిచామని తెలిపారు. -
2020 నుంచి కొత్త కార్లన్నీ అవే!
లండన్: కర్బన్ ఉద్గారాలకు చెక్‌పెట్టి, కాల్యుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ కార్లకు ఆటో కంపెనీలన్నీ వరుస బెట్టి స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా లగ్జరీ కారు తయారీదారి జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) తన ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్‌ను ప్రకటించింది. 2020 నుంచి తమ కొత్త వాహానాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలేనని వెల్లడించింది. వోల్వో ప్రకటించిన రెండు నెలల తర్వాత జేఎల్ఆర్ తన ప్లాన్‌ను ప్రకటించింది. జేఎల్ఆర్ అభివృద్ధి చేసే కొత్త మోడల్స్ అన్నీ ఇక పూర్తిగా ఎలక్ట్రిక్ లేదా విద్యుత్, సంప్రదాయ ఇంజిన్లతో కూడిన హైబ్రిడ్ వాహనాలేనని గురువారం తెలిపింది. వచ్చే ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్ జాగ్వార్ ఐ-పేస్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పింది. అయితే ప్రస్తుత మోడల్స్ అన్నీ పూర్తిగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో రూపొందుతున్నాయి. వీటిని ప్రస్తుతమైతే ఇలానే కొనసాగించనున్నట్టు జేఎల్ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ తెలిపారు. మరోవైపు ఎలక్ట్రిక్ మోడల్స్ డిమాండ్ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2040 నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ వాహనాల విక్రయాలను నిషేధిస్తున్నట్టు బ్రిటన్ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎలక్ట్రిక్ మోడల్స్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. జేఎల్ఆర్ గతేడాది రూపొందించిన 1.7 మిలియన్ల కార్లలో 5,50,000 కార్లు బ్రిటన్ కోసమే అభివృద్ది చేసింది. తన స్వదేశీ మార్కెట్లో ఎలక్ట్రిక్ మోడల్స్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు జేఎల్ఆర్ చెప్పింది. బ్రిటన్‌లో ఇది అతిపెద్ద కారు తయారీదారి. -
జేఎల్ఆర్ కూడా గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించేందుకు మరో ఆటో దిగ్గజం కూడా తన కార్లపై ధరలను తగ్గించింది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) తన మొత్తం వాహనాల రేంజ్‌పై సగటున 7 శాతం మేర ధరలను తగ్గిస్తున్నట్టు నేడు ప్రకటించింది. ఇప్పటికే మారుతీ సుజుకీ కూడా తన కార్లన్నంటిపై 3 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. జీఎస్టీ కింద పన్ను తగ్గుతుండటంతో, ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని జేఎల్ఆర్ చెప్పింది. తక్షణమే ఈ రేట్ల తగ్గింపు అమల్లోకి వస్తుందని కూడా కంపెనీ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక కొత్త ధరల్లో తమ వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా జేఎల్ఆర్కు 25 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. '' ఎక్స్‌షోరూం ఢిల్లీ ధరల ప్రకారం మా వాహనాలన్నింటిపై సగటున 7 శాతం మేర ధరలు తగ్గిస్తున్నాం'' అని జేఎల్ఆర్ భారత అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సురి చెప్పారు. జేఎల్ఆర్ పోర్టుఫోలియోలో ఉన్న ఎక్స్ఈ కారు ప్రారంభ ధర రూ.34.64 లక్షలు కాగ, ఎక్స్ఎఫ్ ప్రారంభ ధర రూ.44.89 లక్షలు. అంతేకాక ఎఫ్-పేస్ ధర రూ.67.37 లక్షల నుంచి ఎక్స్‌జే రేటు రూ.97.39 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. కొత్త పన్ను విధానం జీఎస్టీ కింద 1500సీసీ పైన ఉన్న పెద్ద పెద్ద లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై 15 శాతం పైగా సెస్ ఉండి, 28 శాతం పన్ను పడుతోంది. అయితే ఇది అంతకముందున్న 50 శాతం పన్ను రేట్ల కంటే తక్కువనే. దీంతో కంపెనీలు కూడా తమ వాహనాలపై ధరలను తగ్గిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి రావడంతో, రవాణా చేసే సమయం కూడా తగ్గుతుందని తాము భావిస్తున్నట్టు రోహిత్ చెప్పారు. కంపెనీకి చెందిన పుణే ప్లాంట్లలో వాహనాలను తయారుచేసి, జేఎల్ఆర్ వీటిని దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. -
ఆ ఆటో దిగ్గజంలో 5వేల ఉద్యోగాలు
బ్రిటిష్ అతిపెద్ద ఆటో తయారీ సంస్థగా పేరున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్తగా 5000 మంది ఇంజనీర్ల కోసం వెతుకుతుందట. లగ్జరీ బ్రాండు కోసం కొత్త కారు మోడల్స్ ను అభివృద్ధి చేయడానికి 5000 మంది కొత్తసిబ్బందిని నియమించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జేఎల్ఆర్ కు గ్లోబల్ గా 40వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుతం 1000 మంది ఎలక్ట్రానిక్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను, మిగతా 4000 మందిని అదనంగా మానుఫ్రాక్ట్ర్చరింగ్ లో నియమించుకోనున్నట్టు తెలిపింది. వచ్చే 12 నెలల్లో ఈ నియామకాల ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఎక్కువ ఉద్యోగాలు కూడా యూకేలో ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీలోకి ఈ కారు సంస్థ మరలుతున్న క్రమంలో ఈ నియామకాల ప్రక్రియను కంపెనీ చేపడుతోంది. సంప్రదాయబద్దంగా సీవీల రూపంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కంపెనీ తెలిపింది. తక్కువ వేతనాల వృద్ధి, బ్రెగ్జిట్ ఆందోళనతో దేశీయ ఆర్థిక వ్యవస్థ కొంత ఒత్తిడిని ఎదుర్కోనుందని, కానీ ఎగుమతులతో వీటిని అధిగమించవచ్చని గార్డియన్ రిపోర్టు చేసింది. యూకేలో అతిపెద్ద ఎగుమతిదారుల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒకటి. ప్రస్తుతం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే చర్చలను ప్రారంభించింది. ఈ కారు తయారీసంస్థ 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు మధ్య కాలంలో 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది. -
టాటా మోటార్స్ అంతర్జాతీయ విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అంతర్జాతీయ విక్రయాలు ఏప్రిల్ నెలలో 9 శాతం క్షీణతతో 73,691 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ విక్రయాలు 81,333 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 6 శాతం వృద్ధితో 51,749 యూనిట్ల నుంచి 54,847 యూనిట్లకు పెరిగాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలు 2.41 శాతం వృద్ధితో 40,933 యూనిట్ల నుంచి 41,923 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్ వాహన అమ్మకాలు 36 శాతం క్షీణతతో 29,584 యూనిట్ల నుంచి 18,844 యూనిట్లకు తగ్గాయి. -
జేఎల్ఆర్ ధరలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) రెండు మోడళ్ల కార్ల ధరలను రూ.4.08 లక్షల వరకు తగ్గించింది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ డీజిల్ రకం మోడల్ ధరను రూ.4.08 లక్షలు తగ్గించడంతో రూ.43.8లక్షలకు తగ్గింది. ఇంతకుముందు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.47.88 లక్షలు. రేంజ్ రోవర్ ఎవోక్వ్ డీజిల్ మోడల్ ధరను రూ.3.25 లక్షలు తగ్గించడంతో దీని ధర రూ.49.10 లక్షల నుంచి రూ. 45.85 లక్షలకు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర) దిగొచ్చింది. ల్యాండ్‌రోవర్ కార్లకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా దీన్ని మరింత మందికి చేరువ చేసే ఉద్దేశ్యంతో కార్ల ధరలను తగ్గించినట్టు జేఎల్ఆర్ ఇండియా ఎండీ రోహిత్ సూరి చెప్పారు. -
టాటా మోటార్స్ చరిత్రలో తొలిసారి..
టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) విక్రయాల్లో దూసుకెళ్లింది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేనంతగా 6,04,009 యూనిట్లను విక్రయించింది. గతేడాది కంటే ఈ విక్రయాలు 16 శాతం ఎక్కువని కంపెనీ పేర్కొంది. ఆరు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించడం తమ కంపెనీ చరిత్రలోనే మొదటిసారని టాటా మోటార్స్ శుక్రవారం బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. 2017 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలోనూ కంపెనీ రిటైల్ సేల్స్ 13 శాతం పెరిగి, 1,79,509 వెహికిల్స్ ను అమ్మినట్టు ప్రకటించింది. 2016 మార్చి కంటే ఈ ఏడాది మార్చిలో 21 శాతం విక్రయాలను పెంచుకుని 90,838 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. అమ్మక వృద్ధి నమోదుచేయడం వరుసగా ఇది ఏడో సంవత్సరమని , ఈ ఏడాది ఆరు లక్షల మార్కును ఛేదించినట్టు జేఎల్ఆర్ గ్రూప్ సేల్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆండి గాస్ చెప్పారు. గత 12 నెలలుగా మూడు కొత్త ప్రొడక్ట్ లను లాంచ్ చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తులతో తాము ఈ వృద్ధిని నమోదుచేస్తున్నామని ఆనందం వ్యక్తంచేశారు. -
టాటా మోటార్స్‌కు జేఎల్ఆర్ జోష్!
ముంబై: టాటా- మిస్త్రీ వివాదం, డీమానిటైజేషన్ కారణంగా ఇటీవల భారీ నష్టాలను చవిజూసిన టాటామోటార్స్ ఊపిరి పీల్చుకుంటోంది. నేటి (గురువారం, జనవరి 5) మార్కెట్లో భారీ లాభాలతో దూసుకుపోతోంది. డిసెంబర్ నెల జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) వాహన అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు కంపెనీ ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2016లో అమెరికాలో 105,104 విహనాలను విక్రయించింది. 2015లో విక్రయించిన వాహనాలతో పోలిస్తే 24శాతం వృద్ధిని సాధించినట్టు కంపెనీ తెలిపింది. 2015 లో వీటి సంఖ్య 85,048 విక్రయించింది. 2002 నాటి గరిష్ట అమ్మకాలను (102,191) దాటి రికార్డు స్థాయి అమ్మకాలను అధిగమించినట్టు చెప్పింది. దీంతో టాటా మోటార్స్ కౌంటర్ కొనుగోళ్లతో కళకళలాడుతూ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దాదాపు 3 శాతం ఎగసి రెండు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు ఆరంభంనుంచి సానుకూలంగా కదులుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 200 పాయింట్ల లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. -
జాగ్వార్ కొత్త రేంజ్ రోవర్ లాంచ్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ సొంతమైన లగ్జూరియస్ కార్ల తయారీ సంస్థ జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) మరో సరికొత్త రేంజ్ రోవర్ కారును లాంచ్ చేసింది. 2107 మోడల్ రేంజ్ రోవర్ ఎవోక్ పేరుతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.49.10 లక్షలు నుంచి రూ.67.9లక్షల (దిల్లీ ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సంస్థ తెలిపింది. 'విడుదలైన నాటి నుంచే రేంజ్ రోవర్ ఎవోక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సరికొత్త హంగులతో 2017 మోడల్‌ను మార్కెట్ లోకి తీసుకు రావడం సంతోషంతగా ఉందని జేఎల్ఆర్ ఇండియా అధ్యక్షుడు రోహిత్ సూరి ఓ ప్రకటనలో తెలిపారు. 017 రేంజ్ రోవర్ ఎవోక్ ఇంజినీయమ్ 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో , ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. భారతదేశంలో మొట్టమొదటిగా లాంచ్ కానున్న ల్యాండ్ రోవర్ పోర్ట్‌ఫోలియోలో డిస్కవరీ స్పోర్ట్ రూ 47,59 లక్షల ప్రారంభ ధరగా , రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ రూ 1.18 కోట్లు, ఫ్లాగ్షిప్ రేంజ్ రోవర్ రూ.2.13 కోట్లలో విక్రయించనున్నట్టు టాటా మెటార్స్ తెలిపింది. -
టాటా మోటార్స్ కు ఫలితాల దెబ్బ
ముంబై: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఫలితాల దెబ్బతో కుదేలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఈ కౌంటర్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. సోమవారం విడుదలైన టాటా మోటార్స్ రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలు తప్పడంతో నేటి మార్కెట్ లో మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్ బలహీన ప్రదర్శన కారణంగా టాటా మోటార్స్ షేరు 10.11 శాతం పతనమైంది. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 848 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం 7 శాతం పెరిగి రూ. 67,000 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 10.4 శాతం నుంచి 9.4 శాతానికి తగ్గాయి. కాగా, స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ2లో రూ. 631 కోట్ల నష్టం ప్రకటించింది. గత క్వార్టర్ నష్టం రూ. 289 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ. 11,406 కోట్లను తాకింది. నిర్వహణ లాభం'(ఇబిటా) 61 శాతం క్షీణించి రూ. 306 కోట్లకు పరిమితంకాగా, ఇబిటా మార్జిన్లు 6.6 శాతం నుంచి 2.7 శాతానికి బలహీనపడ్డాయి. కాగా టాటా -మిస్త్రీ బోర్డ్ రూం వార్ లో సైరస్ మిస్త్రీ టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించబడ్డారు. అయితే టాటా మోటార్స్ ఛైర్మన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
జాగ్వార్ పై బ్రిగ్జిట్ దెబ్బ..!
ముంబై : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే దెబ్బ ఇటు ఆర్థిక వ్యవస్థలతో పాటు అటు కార్ల కంపెనీలపై పడనుంది. టాటా మోటార్స్ యూకే సబ్సిడిరీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కార్యకలాపాలపై ఈ ప్రభావం ఉండనుందని ఈ కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. సంస్కరించబడిన యూరోపియన్ యూనియన్ లో యూకే మెంబర్ షిప్ కొనసాగించడంపై జేఎల్ఆర్ మద్దతు పలుకుతోంది. అయితే బ్రిటన్ ఎగ్జిట్ తో ఏదైనా మార్పు సంభవిస్తే తమ కార్ల అమ్మకాలు, ఖర్చులు, స్కిల్ బేస్ పై తీవ్ర ప్రభావం పడనుందని పేర్కొన్నారు. 23 జూన్ లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ పై రెఫరాండంలో యూకే ఎలక్ట్రోరేట్ కూడా పాల్గొననుంది. ఇప్పటికే ఈ ఫలితాలు స్టాక్ మార్కెట్లపైనా, కరెన్సీలపై, గ్లోబల్ ఎకనామీలపై, కార్పొరేట్లపై ఎఫెక్ట్ చూపనున్నాయని ఆర్థికవేత్తలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ను టాటా మోటార్స్ పెట్టుబడిదారులు దగ్గరగా పర్యవేక్షిస్తున్నారని జేఎల్ఆర్ పేర్కొంది. ఏదైనా మార్పు సంభవిస్తే కొంత ప్రతికూల ప్రభావమే చూపొచ్చని తెలిపింది. ఇప్పటివరకూ యూరోపియన్ యూనియన్ లో ఉత్పత్తులకు ఫ్రీ మూవ్ మెంట్ ఎక్కువగా కలిగి ఉన్నాయని, దీంతో యూరోపియన్ దేశాల్లో కార్లను అమ్మినందుకు జేఎల్ఆర్ ఎటువంటి టారిఫ్ లను చెల్లించలేదని చెప్పింది. ఈ ఈవెంట్ జేఎల్ఆర్ పై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశాలున్నాయని, ఆర్థికలోటు పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూకే వృద్ధి తక్కువ నమోదవుతుందని , ఉద్యోగాలు తగిన స్థాయిలో ఉండక పడిపోతాయని పేర్కొంటున్నారు. వలసదారులపై ఆంక్షలు పెరుగుతాయని, దీంతో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కంపెనీ కోల్పోయే ప్రమాదం ఉందని స్థానిక బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. బ్రిగ్జిట్ మొదలైనప్పటి నుంచి గ్రేట్ బ్రిటీష్ పౌండ్ క్షీణిస్తుంది. ఒకవేళ బ్రిటన్ వైదొలిగితే మరింత పడిపోయే అవకాశాలున్నాయి. ఈ క్షీణతతో ఎగుమతుల వల్ల కొంత ప్రయోజనం చేకూరినా.. కంపెనీ దిగుమతుల బిల్లు మాత్రం పెరిగిపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.