
అవమానించినా.. ఆదుకున్నాం!
ఫోర్డ్ నుంచి జేఎల్‌ఆర్ టేకోవర్‌పై టాటాల మనోగతం
ముంబై: నవ్విన నాపచేనే పండటం అంటే ఇదేనేమో!! దేశీ కార్పొరేట్ అగ్రగామి టాటా గ్రూప్ తమ కార్ల వ్యాపారాన్ని విక్రయించడం కోసం 1999లో ఫోర్డ్‌ను సంప్రదిస్తే... హేళనలు, అవమానాలను ఎదుర్కొంది. అదే టాటా గ్రూప్... తొమ్మిదేళ్ల తర్వాత ఫోర్డ్ నుంచి బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్‌లు జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్)ను దక్కించుకొని ఆ సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించింది.
ఈ డీల్‌ను సాకారం చేసింది అప్పటి టాటా గ్రూప్ చైర్మన్ టాటా రతన్ టాటా(ప్రస్తుతం గ్రూప్ గౌరవ చైర్మన్). ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఫోర్డ్‌తో చర్చల సందర్భంగా రతన్ టాటా బృందంలోని కీలక సభ్యుడు ప్రవీణ్ కాడ్లే ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
‘మా కార్ల తయారీ విభాగాన్ని అమ్మడానికి 1999లో డెట్రాయిట్‌లోని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లను కలిశాం. రతన్‌టాటాతో పాటు నేను కూడా ఆ సంప్రదింపుల టీమ్‌లో ఉన్నా. ఆ భేటీలో ఫోర్డ్ సభ్యుల నుంచి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నాం. అసలు మీరు(టాటా గ్రూప్) ఈ వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించారు. మీకు దీని గురించి ఏం తెలుసు. దీన్ని కొనుగోలు చేసి ఉపకారం చేస్తాం.. అంటూ వాళ్లు హేళనగా మాట్లాడారు. వెంటనే మేం అదే సాయంత్రం న్యూయార్క్‌కు తిరిగొచ్చేశాం. ఆ 90 నిమిషాల విమాన ప్రయాణంలో రతన్ టాటా చాలా విచారంగా కనిపించారు. అయితే, 2008లో సీన్ మొత్తం రివర్స్ అయింది.
మేం జేఎల్‌ఆర్‌ను ఫోర్డ్ మోటార్స్ నుంచి టేకోవర్ చేయడానికి ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అప్పుడు రతన్ టాటాకు ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా దీన్ని కొనుగోలు చేసి మాకెంతో ఉపకారం చేస్తున్నారంటూ కీర్తించారు కూడా’ అని కాడ్లే గత స్మృతులను తెలియజేశారు. వైబీ చవాన్ జాతీయ అవార్డు-2014ను రతన్ టాటా తరఫున అందుకుంటూ ఆయన ఈ విషయాలు చెబుతుంటే అక్కడ హాజరైన వారంతా చప్పట్లతో హోరెత్తించారు.
టాటా మోటార్స్‌ను వృద్ధి బాటలోకి తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్‌ల బృందంలో కాడ్లే కీలక పాత్ర పోషించారు. 21 ఏళ్లుగా టాటా గ్రూప్‌లో పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం టాటా క్యాపిటల్‌కు సారథిగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకుని దివాలా అంచున నిలిచిన ఫోర్డ్ నుంచి జేఎల్‌ఆర్‌ను టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లు(దాదాపు 14,300 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేయడం తెలిసిందే. ఇప్పుడు దేశీయంగా మందగమనం ఎదుర్కొంటున్న టాటా మోటార్స్‌కు ప్రధాన ఆదాయ వనరుగా జేఎల్‌ఆర్ నిలుస్తుండటం విశేషం.