స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి జాగ్వార్ ల్యాండ్ రోవర్
లండన్ : బ్రిటీష్ ఆటోమోటివ్ బ్రాండ్లకు చిహ్నంగా నిలిచిన జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఇక స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ దూసుకుపోతున్న నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 2017లో బెస్పోక్ స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్ లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్ ఫోన్లను, యాక్ససరీస్ లను మార్కెట్లోకి తీసుకురావడానికి వినియోగదారుల ఎలక్ట్రానిక్ కంపెనీ బుల్లిట్ గ్రూప్ తో లాండ్ రోవర్ ఒప్పందం కుదుర్చుకుంది.
బుల్లిట్ గ్రూప్ తో కలిసి ల్యాండ్ రోవర్ డిజైన్ కు గుర్తింపుగా, అధునాతన టెక్నాలజీతో కొత్త తరహాలో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడం గొప్ప అవకాశమని జాగ్వార్ ల్యాండ్ రోవర్ లైసెన్సింగ్ అండ్ బ్రాండెడ్ డైరెక్టర్ లిండ్సే వీవర్ తెలిపారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు చెందిన ఇంజనీరింగ్, డిజైన్ టీమ్ ను ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేటాయించామని, ల్యాండ్ రోవర్ బ్రాండ్, ప్రొడక్ట్ విలువను పెంచేరీతిలో బెస్పోక్ అప్లికేషన్లను వారు రూపొందిస్తారని పేర్కొన్నారు. 2017లో మార్కెట్లోకి రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్లు ల్యాండ్ రోవర్ బ్రాండ్ కోర్ విలువలతో రూపొందించనున్నారు. అధునాతన టెక్నాలజీతో వినూత్నంగా దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు.