
బాండ్ కొత్త చిత్రంలో జేఎల్‌ఆర్ కార్ల హల్‌చల్
లండన్: ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ ప్రియులను అలరించనున్న కొత్త చిత్రం ‘స్పెక్టర్’లో జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) కార్లు హల్‌చల్ చేయనున్నాయి. ఈ సినిమాలో మూడు జేఎల్‌ఆర్ మోడల్స్ కనువిందు చేస్తాయని భారతీయ వాహన దిగ్గజం, జేఎల్‌ఆర్ యాజమాన్య సంస్థ అయిన టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది. బాండ్ 007(డేనియల్ క్రెయిగ్)తో చేజింగ్ సీన్‌లో చిత్రంలోని విలన్ జాగ్వార్ సీ-ఎక్స్75 ప్రోటోటైప్‌ను నడుపుతాడని టాటా మోటార్స్ వెల్లడించింది.
బాండ్ సిరీస్‌లో వస్తున్న ఈ 24వ చిత్రంలోని తమ కార్లలో జేఎల్‌ఆర్ ప్రత్యేక ఫీచర్లయిన బెస్పోక్ సస్పెన్షన్, మరింత అధునాతన బాడీ ప్రొటెక్షన్ వంటివి ఉంటాయని పేర్కొంది.కాగా, భారీ మార్పుచేర్పులతో రూపొందించిన లాండ్‌రోవర్ డిఫెండర్స్, రేంజ్‌రోవర్ స్పోర్ట్స్ ఎస్‌వీఆర్‌లతో ఆస్ట్రియాలో ఇప్పటికే కొన్ని సీన్‌లను చిత్రీకరించినట్లు జేఎల్‌ఆర్ స్పెషల్ ఆపరేషన్స్ ఎండీ జాన్ ఎడ్వర్డ్స్ చెప్పారు. 2012లో వచ్చిన బాండ్ చిత్రం ‘స్కైఫాల్’లో కూడా జేఎల్‌ఆర్ ‘డిఫెండర్ 110’ డబుల్ క్యాబ్ పికప్ ప్రేక్షకులను అలరించింది. కాగా, శామ్ మెండెస్ దర్శకత్వంలో వస్తున్న ‘స్పెక్టర్’.. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.