క్యూ1లో రూ. 5,556 కోట్లు; 74 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024–25, క్యూ1)లో బంపర్ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 74 శాతం జంప్ చేసి రూ. 5,566 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,204 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా దేశీ వాహన వ్యాపారంతో పాటు జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) పటిష్టమైన పనితీరు ఇందుకు దోహదం చేసింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 1,03,597 కోట్ల నుంచి రూ. 1,09,623 కోట్లకు వృద్ధి చెందింది. స్టాండెలోన్ ప్రాతిపదికన (దేశీ కార్యకలాపాలు) క్యూ1లో కంపెనీ రూ. 2,190 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 64 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 16,132 కోట్ల నుంచి రూ. 18,851 కోట్లకు పెరిగింది. ఇక జూన్ క్వార్టర్‌లో జేఎల్‌ఆర్ ఆదాయం కొత్త రికార్డులను తాకింది. 5 శాతం వృద్ధితో 7.3 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది.
టాటా మోటార్స్ షేరు ధర 1 శాతం లాభపడి రూ.1,145 వద్ద ముగిసింది.
కంపెనీ విభజనకు బోర్డు ఓకే...
టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడగొట్టే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం, టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) నుంచి వాణిజ్య వాహన వ్యాపారాన్ని టాటా మోటార్స్ సీవీగా విభజిస్తారు. ప్రస్తుత పీవీ వ్యాపారం టీఎంఎల్‌లో విలీనం అవుతుంది. విభజన తర్వాత టీఎంఎల్‌సీవీ, టీఎంఎల్ పేర్ల మార్పుతో పాటు రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తయ్యేందుకు 12–15 నెలలు పట్టొచ్చని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment