
టాటా మోటార్స్ లాభం 3,918 కోట్లు
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది ఆఖరి త్రైమాసికం(2013-14-క్యూ4)లో రూ.3,918 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,945 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా తగ్గింది. కాగా. మొత్తం ఆదాయం రూ.55,002 కోట్ల నుంచి రూ.64,317 కోట్లకు వృద్ధి చెందింది. అంటే 16.6 శాతం పెరిగింది. దేశీయంగా ఆర్థిక మందగమనం, అమ్మకాలు బలహీనంగా ఉన్నప్పటికీ.. బ్రిటన్‌లో తమ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) పటిష్టమైన విక్రయాలు, కొత్త వాహనాలకు డిమాండ్ జోరుగా ఉండటం వంటివి కంపెనీకి ఆసరాగా నిలిచాయని టాటా మోటార్స్ పేర్కొంది. కాగా, మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 41.4 శాతం ఎగబాకి రూ.13,991 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో కంపెనీ లాభం రూ.9,893 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 23.3 శాతం వృద్ధితో రూ.1,88,793 కోట్ల నుంచి రూ.2,32,834 కోట్లకు ఎగబాకింది.
దేశీయంగా పెరిగిన నష్టాలు...
స్టాండెలోన్ ప్రాతిపదికన(దేశీయ కార్యకలాపాలు) కంపెనీ గతేడాది క్యూ4లో రూ.817 కోట్ల భారీ నికర నష్టాన్ని చవిచూసింది. 2012-13 క్యూ4లో నష్టం రూ.312 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.11,068 కోట్ల నుంచి రూ.8,545 కోట్లకు పడిపోయింది. పూర్తి ఏడాదికి స్టాండెలోన్ నికర లాభం రూ. 302 కోట్ల నుంచి రూ.335 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం పూర్తి ఏడాదిలో రూ.44,766 కోట్ల నుంచి రూ.34,288 కోట్లకు తగ్గింది. 2013-14లో కంపెనీ దేశీయంగా 3,77,909 వాణిజ్య వాహనాలను, 1,41,846 ప్రయాణికుల వాహనాలను విక్రయించింది.
ఆర్థిక వ్యవస్థ మందగమనం, అధిక వడ్డీరేట్లు, ఇంధన ధరలు, రుణాల లభ్యత తగ్గడం వంటివి దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) సి.రామకృష్ణన్ చెప్పారు.
జేఎల్‌ఆర్ జోరు...: బ్రిటిష్ యూనిట్ జేఎల్‌ఆర్ 2013-14 మార్చి క్వార్టర్‌లో 449 మిలియన్ పౌండ్‌ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 377 మిలియన్ పౌండ్‌ల లాభంతో పోలిస్తే 19.1% ఎగసింది. ఆదాయం 5.9% వృద్ధితో 5.349 బిలియన్ పౌండ్‌లకు ఎగబాకింది.