న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘ఎలైట్ ఐ20’లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. దీని ప్రారంభ ధర రూ.7.04 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది.
తాజా వేరియంట్ ద్వారా ప్రీమియం కాంపాక్ట్ విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లకు ఉన్న బలమైన డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. కాగా 2015లో 4 శాతంగా ఉన్న ప్రీమియం కాంపాక్ట్ విభాగంలోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల అమ్మకాలు, 2018 నాటికి 14 శాతానికి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్‌లలో పెట్రోల్ వేరియంట్లు
న్యూఢిల్లీ: జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఇండియా తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీలు డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్‌లో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ప్రారంభ ధర వరుసగా రూ.49.2 లక్షలు, రూ.51.06 లక్షలుగా ఉంది. ఈ రెండు వేరియంట్లలోనూ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఇంజీనియమ్ 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
‘‘రేంజ్ రోవర్ వెలార్‌లో ఇప్పటికే అధిక పనితీరు కనబరిచే ఇంజీనియమ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చాం. ఇప్పుడు ఇదే ఇంజిన్‌ను డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్‌లలోనూ అందుబాటులోకి తీసుకువచ్చాం’’ అని జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి పేర్కొన్నారు. వీటిల్లో వై–ఫై హాట్‌స్పాట్ (4జీ యాక్సెస్‌తోపాటు 8 వరకు డివైస్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు) సహా పలు ఇతర ఫీచర్లను పొందుపరిచామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment