ముంబై: టాటా- మిస్త్రీ వివాదం, డీమానిటైజేషన్ కారణంగా ఇటీవల భారీ నష్టాలను చవిజూసిన టాటామోటార్స్ ఊపిరి పీల్చుకుంటోంది. నేటి (గురువారం, జనవరి 5) మార్కెట్లో భారీ లాభాలతో దూసుకుపోతోంది. డిసెంబర్ నెల జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) వాహన అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు కంపెనీ ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
2016లో అమెరికాలో 105,104 విహనాలను విక్రయించింది. 2015లో విక్రయించిన వాహనాలతో పోలిస్తే 24శాతం వృద్ధిని సాధించినట్టు కంపెనీ తెలిపింది. 2015 లో వీటి సంఖ్య 85,048 విక్రయించింది. 2002 నాటి గరిష్ట అమ్మకాలను (102,191) దాటి రికార్డు స్థాయి అమ్మకాలను అధిగమించినట్టు చెప్పింది. దీంతో టాటా మోటార్స్ కౌంటర్ కొనుగోళ్లతో కళకళలాడుతూ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దాదాపు 3 శాతం ఎగసి రెండు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు ఆరంభంనుంచి సానుకూలంగా కదులుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 200 పాయింట్ల లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.