
మార్కెట్లోకి జేఎల్ఆర్ కొత్త ‘ఎక్స్ జే సలూన్’
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తాజాగా తన లగ్జరీ ‘ఎక్స్‌జే సలూన్’ మోడల్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.98.03 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబై). ఆధునిక టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్, మంచి పనితీరు వంటి ప్రత్యేకతలు ఎక్స్‌జే సలూన్ సొంతమని జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు.
ఎక్స్‌జే పెట్రోల్ వేరియంట్ ధర రూ.99.23 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధరలు రూ.98.03 లక్షలు నుంచి రూ.1.05 కోట్ల మధ్యలో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కారులో ఇంధనం, ఉష్ణోగ్రత, వేగం వంటి విషయాలను తెలియజేసే 31 సెంటీమీటర్ల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఎల్‌ఈడీ లైట్స్, కొత్త ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ నావిగేషన్ వ్యవస్థ, గ్లాస్ రూఫ్, కొత్త సస్పెన్షన్ సెట్టింగ్స్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్, ఏఎస్‌పీసీ టెక్నాలజీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.