
టాటా మోటార్స్ లాభం 3 రెట్లు జూమ్
ముంబై: జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) విక్రయాల ఊతంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నికరలాభం ఏకంగా మూడు రెట్లు ఎగిసింది. మార్కెట్ అంచనాలను మించి రూ. 5,398 కోట్లుగా నమోదైంది. గడిచిన తొమ్మిది త్రైమాసికాల్లో ఇదే అత్యధిక లాభం. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో లాభం రూ. 1,726 కోట్లు మాత్రమే. క్యూ1లో టాటా మోటార్స్ రూ. 3,500 కోట్ల లాభం ఆర్జించే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
అయితే, కంపెనీ దాన్ని మించిన లాభాలు సాధించడం గమనార్హం. క్యూ1లో జేఎల్‌ఆర్ 150 మిలియన్ పౌండ్ల మేర డివిడెండును మాతృసంస్థకు చెల్లించింది. జేఎల్‌ఆర్ అమ్మకాలు భారీగా పెరగడంతో కంపెనీ మార్జిన్లు 550 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడ్డాయి. 15.8 శాతం నుంచి 20.3 శాతానికి ఎగిశాయి. అయితే, దేశీయ కార్యకలాపాల ద్వారా మార్జిన్లు మాత్రం 2.8 శాతం నుంచి 2.3 శాతానికి క్షీణించాయి. మార్కెట్ వాటాను మెరుగుపర్చుకునే దిశగా టాటా మోటార్స్ మంగళవారం కొత్త సెడాన్ జెస్ట్‌ను ఆవిష్కరించనుంది.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన టాటా మోటార్స్ నికర ఆదాయం 38 శాతం ఎగిసి రూ. 64,683 కోట్లకు చేరింది. ఇందులో సింహభాగం వాటా జేఎల్‌ఆర్‌దే. ఈ విభాగం ఆదాయాలు 54 శాతం పెరిగి రూ.54,426 కోట్లుగా నమోదయ్యాయి. అయితే టాటాతో పాటు ఇతర బ్రాండ్ల వాహనాల విక్రయాలు, ఫైనాన్సింగ్ కార్యకలాపాల ద్వారా ఆదాయాలు 11 శాతం క్షీణించి రూ. 9,898 కోట్లకు పరిమితమయ్యాయి.
దేశీయంగా బలహీన పరిస్థితులు నెలకొన్నప్పటికీ .. అంతర్జాతీయంగా వైవిధ్యభరితమైన జేఎల్‌ఆర్ కొంగొత్త ఉత్పత్తులకు డిమాండ్ ఉండటంతో ఆ ప్రభావాలను గణనీయంగా అధిగమించగలిగామని టాటా గ్రూప్ సీఎఫ్‌వో సి. రామకృష్ణన్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆటో మార్కెట్ చైనాలో అమ్మకాలు మెరుగ్గా ఉండటం వల్ల తమ నికర ఆదాయం 304 మిలియన్ పౌండ్ల నుంచి 693 పౌండ్లకు పెరిగిందని జేఎల్‌ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ పేర్కొన్నారు.