జేఎల్‌ఆర్ కూడా గుడ్‌న్యూస్
జేఎల్‌ఆర్ కూడా గుడ్‌న్యూస్
Published Sat, Jul 1 2017 1:17 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM
న్యూఢిల్లీ : జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించేందుకు మరో ఆటో దిగ్గజం కూడా తన కార్లపై ధరలను తగ్గించింది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) తన మొత్తం వాహనాల రేంజ్‌పై సగటున 7 శాతం మేర ధరలను తగ్గిస్తున్నట్టు నేడు ప్రకటించింది. ఇప్పటికే మారుతీ సుజుకీ కూడా తన కార్లన్నంటిపై 3 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. జీఎస్టీ కింద పన్ను తగ్గుతుండటంతో, ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని జేఎల్‌ఆర్ చెప్పింది. తక్షణమే ఈ రేట్ల తగ్గింపు అమల్లోకి వస్తుందని కూడా కంపెనీ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక కొత్త ధరల్లో తమ వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా జేఎల్‌ఆర్‌కు 25 రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయి.
'' ఎక్స్‌షోరూం ఢిల్లీ ధరల ప్రకారం మా వాహనాలన్నింటిపై సగటున 7 శాతం మేర ధరలు తగ్గిస్తున్నాం'' అని జేఎల్‌ఆర్ భారత అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సురి చెప్పారు. జేఎల్‌ఆర్ పోర్టుఫోలియోలో ఉన్న ఎక్స్‌ఈ కారు ప్రారంభ ధర రూ.34.64 లక్షలు కాగ, ఎక్స్‌ఎఫ్ ప్రారంభ ధర రూ.44.89 లక్షలు. అంతేకాక ఎఫ్-పేస్ ధర రూ.67.37 లక్షల నుంచి ఎక్స్‌జే రేటు రూ.97.39 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. కొత్త పన్ను విధానం జీఎస్టీ కింద 1500సీసీ పైన ఉన్న పెద్ద పెద్ద లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై 15 శాతం పైగా సెస్ ఉండి, 28 శాతం పన్ను పడుతోంది. అయితే ఇది అంతకముందున్న 50 శాతం పన్ను రేట్ల కంటే తక్కువనే. దీంతో కంపెనీలు కూడా తమ వాహనాలపై ధరలను తగ్గిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి రావడంతో, రవాణా చేసే సమయం కూడా తగ్గుతుందని తాము భావిస్తున్నట్టు రోహిత్ చెప్పారు. కంపెనీకి చెందిన పుణే ప్లాంట్లలో వాహనాలను తయారుచేసి, జేఎల్‌ఆర్ వీటిని దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది.
Advertisement