
టాటా మోటార్స్ లాభం హైజంప్
ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ జూలై-సెప్టెంబర్’13(క్యూ2) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 71% జంప్‌చేసి రూ. 3,542 కోట్లయ్యింది. గతేడాది క్యూ2లో రూ. 2,075 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి కంపెనీ అమ్మకాలు కూడా 30% ఎగసి రూ. 55,701 కోట్లను తాకాయి. గతంలో రూ. 42,819 కోట్ల అమ్మకాలే నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) పనితీరు దోహదపడిందని కంపెనీ సీఎఫ్‌వో సి. రామకృష్ణన్ పేర్కొన్నారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా కంపెనీ స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన నష్టాలను ప్రకటించడం గమనార్హం.
స్టాండ్‌ఎలోన్ నష్టాలే...: ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ. 803.5 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది జూలై-సెప్టెంబర్‌లో రూ. 867 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇందుకు దేశీయంగా క్షీణించిన వాణిజ్య, ప్రయాణికుల వాహన అమ్మకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ కాలంలో కంపెనీ అమ్మకాల విలువ రూ. 12,396.5 కోట్ల నుంచి రూ. 8,761 కోట్లకు పడిపోయింది. గతేడాది క్యూ2లో విక్ర యించిన 2,23,665 వాహనాలతో పోలిస్తే ప్రస్తుత సమీక్షా కాలంలో 1,50,930 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఆర్థిక మందగమనానికితోడు, రవాణా, మౌలిక సంబంధ కార్యకలాపాలు కుంటుపడటం, డీజిల్ ధరల పెరుగుదల, వడ్డీరేట్ల వంటి అంశాలు దేశీయ అమ్మకాలను దెబ్బతీశాయని కంపెనీ ఎండీ కార్ల్ స్లిమ్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కంపెనీ పనితీరు మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో కొత్త వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. జేఎల్‌ఆర్ విక్రయాలు దాదాపు 32% జంప్‌చేసి 1,01,931 యూనిట్లకు చేరాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.3% లాభపడి రూ. 385 వద్ద ముగిసింది.