
ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి రూ.20కోట్లు నొక్కేశాడు!
లండన్:అన్నం పెట్టే సంస్థకే కన్నం వేయాలనే చూశాడో ఉద్యోగి. వందలు.. వేలలో కాదు.. ఏకంగా కోట్ల రూపాయలకు ఎరవేశాడు. చివరకు ఆ ఉద్యోగి దొంగతనాలకు బట్టబయలు కావడంతో అతను జైలు పాలైయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. సిమోన్ వెన్ స్లీ.. ప్రముఖ కార్ల కంపెనీ జాక్వర్ ల్యాండ్ రోవర్ లో ఉద్యోగి. అయితే అతను చేసేదల్లా ఉద్యోగం పేరుతో సంస్థకు కన్నం వేయడం. ల్యాండ్ రోవర్ కంపెనీ సంతకాలను వందల సంఖ్యలో ఫోర్జరీ చేసి అధిక సంఖ్యలో కార్ల విడిభాగాలను కాజేస్తాడు. కోవెంట్రీ ప్రాంతంలో ఉన్న ఆ సంస్థకు చెందిన కార్మికులకు దొంగ ఆర్డర్ కాపీలను చూపించి అక్కడి నుంచి కార్ల విడిభాగాలను తరలిస్తాడు. అనంతరం స్థానికంగా ఉండే గ్యారేజ్ లకు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు. దాంతో అతనికి భారీ మొత్తంలో డబ్బులు రావడంతో కుటుంబం కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడపసాగాడు. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు చేసి రూ.20 కోట్లను (2మిలియన్ పౌండ్లు) సొమ్ము చేసుకున్నాడు. తాజాగా అతని బండారం బయటపడటంతో ఐదు సంవత్సరాల శిక్ష పడింది.