ఆ ఆటో దిగ్గజంలో 5వేల ఉద్యోగాలు
ఆ ఆటో దిగ్గజంలో 5వేల ఉద్యోగాలు
Published Mon, Jun 19 2017 8:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
బ్రిటిష్ అతిపెద్ద ఆటో తయారీ సంస్థగా పేరున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్తగా 5000 మంది ఇంజనీర్ల కోసం వెతుకుతుందట. లగ్జరీ బ్రాండు కోసం కొత్త కారు మోడల్స్ ను అభివృద్ధి చేయడానికి 5000 మంది కొత్తసిబ్బందిని నియమించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జేఎల్ఆర్ కు గ్లోబల్ గా 40వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుతం 1000 మంది ఎలక్ట్రానిక్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను, మిగతా 4000 మందిని అదనంగా మానుఫ్రాక్ట్ర్చరింగ్ లో నియమించుకోనున్నట్టు తెలిపింది. వచ్చే 12 నెలల్లో ఈ నియామకాల ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఎక్కువ ఉద్యోగాలు కూడా యూకేలో ఉండనున్నాయి.
ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీలోకి ఈ కారు సంస్థ మరలుతున్న క్రమంలో ఈ నియామకాల ప్రక్రియను కంపెనీ చేపడుతోంది. సంప్రదాయబద్దంగా సీవీల రూపంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కంపెనీ తెలిపింది. తక్కువ వేతనాల వృద్ధి, బ్రెగ్జిట్ ఆందోళనతో దేశీయ ఆర్థిక వ్యవస్థ కొంత ఒత్తిడిని ఎదుర్కోనుందని, కానీ ఎగుమతులతో వీటిని అధిగమించవచ్చని గార్డియన్ రిపోర్టు చేసింది. యూకేలో అతిపెద్ద ఎగుమతిదారుల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒకటి. ప్రస్తుతం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే చర్చలను ప్రారంభించింది. ఈ కారు తయారీసంస్థ 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు మధ్య కాలంలో 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది.
Advertisement