ధరల శ్రేణి రూ. 1,865–1,960
ఈ నెల 15–17 మధ్య ఆఫర్
రూ. 27,870 కోట్ల సమీకరణ
అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డ్
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది.
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్‌ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.
క్రెటా ఈవీ వస్తోంది..
దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్‌ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment