సాక్షి హైదరాబాద్: సైబర్ నేరాలు చేసే నైజీరియన్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చిక్కకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన యువతి నుంచి డబ్బు కాజేయడానికి బేగంపేట వాసుల వివరాలు ఇచ్చినట్లే... బోయిన్‌పల్లికి చెందిన యువతి నుంచి రూ.15 లక్షలు కాజేసేందుకు మైఖేల్ అనే నైజీరియన్ మాట్రి ‘మోసగాడు’ ఉత్తరప్రదేశ్ యువతిని వాడుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ ‘సాక్షి’తో పంచుకున్నారు.
- ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో నివసిస్తున్న డాక్టర్‌గా నగర యువతికి పరిచయమైన నైజీరియన్ మైఖేల్ గిబి ఛిడీ ఆమెకు మాయమాటలు చెప్పాడు.
- హైదరాబాద్‌కు వచ్చి పెళ్లి చేసుకుంటానని, ఆసుపత్రి నిర్మిస్తానంటూ ఆమెతో నమ్మబలికాడు. తన వస్తువులను పార్శిల్ చేస్తున్నానంటూ చెప్పి, కొరియర్ ఆఫీస్ నుంచి అన్నట్లు ఫోన్లు చేయించి వివిధ పన్నుల పేరుతో రూ.15,32,500 కాజేశాడు.
- దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ గంగాధర్ దర్యాప్తు చేశారు.
- ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో మైఖేల్ వాడిన ఫోన్ నంబర్, ఓ బ్యాంకు ఖాతా ఉత్తరప్రదేశ్‌లోని మోబినగర్‌కు చెందినవిగా గుర్తించారు.
- సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఓ నేరం కోసం వాడిన ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాలను మరోసారి వినియోగించరు. అప్పటికే అవి బ్లాక్, ఫ్రీజ్ కావడమో జరుగుందని లేదా తాము చిక్కే ప్రమాదం ఉందని ఈ జాగ్రత్త తీసుకుంటారు.
- బోయిన్‌పల్లి యువతిని మోసం చేయడానికి మైఖేల్ వాడినవి మోబినగర్‌లో పని చేస్తూ ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడికి పంపారు.
- ఘజియాబాద్‌కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోబినగర్ చేరుకున్న ఈ బృందం దాదాపు మూడు రోజుల పాటు మాటు వేసింది. ఆ ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వినియోగిస్తున్నది నిందితుడే అని భావించి అతడి కోసం గాలించారు.
- ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు నైజీరియన్లు భారతీయులనే తమ అనుచరులుగా మార్చుకుని వారి బ్యాంకు ఖాతాలు వాడతారు. సహకరించినందుకు వీరికి కొంత కమీషన్ ఇస్తారు.
- మోబినగర్ యువతి వ్యవహారం కూడా ఇలాంటిదే అని భావించారు. ఆమెను విచారించిన నేపథ్యంలో అసలు విషయం తెలిసింది.
- సదరు యువతిని సైతం మైఖేల్ సోషల్‌మీడియా ద్వారా ట్రాప్ చేశాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు సంగ్రహించిన అతగాడు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు.
- ఢిల్లీలో ఉండే మైఖేల్ తరచు మోబినగర్‌కు వచ్చి ఆమెతో గడిపే వాడు. ఆ సమయంలోనే టార్గెట్ చేసిన వారికి ఆమె ఫోన్ వినియోగించి కాల్స్ చేసేవాడు. ట్రాప్ అయిన వారితో ఆమె ఖాతాలోనే డబ్బులు వేయించేవాడు.
- అనంతరం వాటిని డ్రా చేసుకుని ఉడాయించేవాడు. నగర యువతిని కూడా ఇలానే ట్రాప్ చేశాడు. ఈ విషయం చెప్పిన యూపీ యువతి మైఖేల్ ఆచూకీ చెప్పడంతో అధికారులు అతడిని పట్టుకోగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment