సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి ఏడాది కాలంలో రూ.8 లక్షలు స్వాహా చేసిన కేసులో నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఇదే బాధితుడు మరో నేరంలో రూ.90 లక్షల వరకు నష్టపోగా...ఆ కేసులో భార్యభర్తల్ని గత నెల్లో అరెస్టు చేశారు. మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన పృథ్వీరాజ్ బీటెక్ పూర్తి చేశాడు. తన స్వస్థలంలో సత్సహాయ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. కరోన కాలంలో దీని ద్వారా పలువురికి ఆహారం అందించడం తదితర సేవలు చేశాడు.
అందుకు అవసరమైన డబ్బు విరాళాల రూపంలో రాకపోవడంతో సైబర్ నేరాలు చేసి సంపాదించాలని భావించాడు. యూట్యూబ్‌లో చూసి మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఫేస్‌బుక్‌లో రెడ్డి స్రవంతి అనే పేరు, ఇంటర్‌నెట్ నుంచి సేకరించిన ఫొటోలతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీని ద్వారా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆయన యాక్సెప్ట్ చేయడంతో కొన్నాళ్లు చాటింగ్ చేశాడు. ఆపై ఇద్దరూ తమ ఫోన్ నెంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పటి నుంచి వాట్సాప్‌లో చాటింగ్ చేశారు.
దీని డిస్‌ప్లే పిక్చర్ సైతం యువతిదే ఏర్పాటు చేసిన పృథ్వీరాజ్ ఆమె మాదిరిగానే చాట్ చేస్తూ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వివిధ రకాలైన పేర్లు చెప్పి తన ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయించుకోవడం మొదలెట్టాడు. గతేడాది మార్చ్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం రూ.8 లక్షల వరకు కాజేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దీన్ని దర్యాప్తు చేశారు. నిందితుడి బ్యాంకు ఖాతా వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి గుర్తించి గురువారం పృథ్వీరాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు బాధితుడి నుంచి కాజేసిన సొమ్ముతో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సొంతంగానూ కొంత ఖర్చు చేసుకున్నట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment