
నిజామాబాద్: ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళల మృతికి కారణమైన వ్యక్తికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఆర్మూర్ రూరల్ సర్కిల్ పోలీస్ అధికారి రమణ రెడ్డి కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ప్రకారం.. నేర న్యాయ విచారణ ప్రక్రియలో భాగంగా 38 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, 43 పత్రాలను పరిశీలించారు.
వ్యక్తిగత నిర్లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని ముప్కాల్‌కు చెందిన ముద్దాయి గోపీ శ్రీనివాస్ యాదవ్‌కు ఈ శిక్ష విధించారు. 2018 మార్చి 25న శ్రీనివాస్ తన ఆటో (టీఎస్16 యుబీ 5782)లో ముప్కాల్, కొడిచెర్ల గ్రామాల నుంచి 19 మంది ప్రయాణికులతో బయలుదేరాడు. పరిమితికి మించిన ప్రయాణికులు, అతివేగం, అజాగ్రత్తగా ఆటోను నడపడంతో ఆటో మెండోరా గ్రామ శివారున రోడ్డుపై పల్టీలు కొట్టి రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో పడిపోయింది.
బావిలోని నీటిలో మునిగి బాల్కొండ మండలం చిట్టపూర్ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల తెడ్డు ప్రశంశ, ఐదేళ్ల తెడ్డు చక్కాని, సంవత్సరంన్నర తెడ్డు చిన్ని, ఇరవై ఐదేళ్ల తెడ్డు రోజా, బాల్కొండ మండలం కొడిచెర్ల గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల మెట్టు విన్యశ్రీ, వర్ని మండలం మోస్రా గ్రామవాసి పద్నాలుగేళ్ల పెద్దోల్ల సంపత్, ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామ చిన్నారి ఐదేళ్ల పుట్ట మనస్విని, మోర్తాడ్ మండలం ధర్మోరా మద్దికుంట లక్ష్మి, బాల్కొండ మండలం వెంపల్లి బొప్పారం సాయమ్మ, మెండోరా మండలవాసి నిమ్మ సత్తెమ్మ, డిచ్పల్లి మండలం కేశపూర్ వాసి గుండ్రపు గంగు చనిపోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
ముద్దాయి గోపీ శ్రీనివాస్‌పై నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారిస్తూ భారత శిక్షాస్కృతి సెక్షన్ 304 పార్ట్ 2 ప్రకారం పది సంవత్సరాల కఠిన జైలు శిక్ష, సెక్షన్ 337 ప్రకారం ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, సెక్షన్ 338 ప్రకారం సంవత్సరం జైలుశిక్ష విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.