ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌కు రేపే ఆఖరు
► మార్చి 1తో ముగియనున్న క్రమబద్ధీకరణ గడువు
► మళ్లీ పొడిగించేది లేదన్న ప్రభుత్వం
► రేపు అర్ధరాత్రి వెబ్‌సైట్ నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండ్రోజులు మాత్రమే మిగిలాయి. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల గడువు మార్చి1తో ముగియనుంది. ఊహించిన రీతిలో భవనాలు, లే అవుట్ల యజమానుల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో ఇప్పటివరకు ప్రభుత్వం రెండు పర్యాయాలు ఈ పథకాల గడువు పొడిగించింది. అయినా, ఈ అవకాశాలను వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. మార్చి 1 తర్వాత మళ్లీ పొడిగింపు ఉండదని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు స్వయంగా ప్రకటన చేశారు. దీంతో అనుమతులు లేని/అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ కోసం యజమానులకు ఇంకో రోజు సమయం మిగిలి ఉంది.
మార్చి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ఆన్‌లైన్ దరఖాస్తుల వెబ్‌సైట్‌ను ప్రభుత్వం నిలిపేయనుంది. గడువు సమీపిస్తుండటంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో చివరి రోజు సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా పొడిగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల అమలును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పథకాల కింద దరఖాస్తులు మాత్రమే స్వీకరించాలని, తుది తీర్పునకు లోబడి ఈ దరఖాస్తుల పరిష్కారంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాతే దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
త్వరలో నూతన విధానం
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల గడువు ముగిసిన తర్వాత అక్రమ భవనాలు, లే అవుట్లపై చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ లేఅవుట్లు, భవనాల యజమానులకు స్థానిక మున్సిపల్ కమిషనర్లు నోటిసులు జారీ చేసే చర్యలు చేపడతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో కొత్తగా అక్రమ భవనాలు, లే అవుట్లు ఏర్పాటు కాకుండా ఎప్పటికప్పుడు నిరోధించేందుకు కట్టుదిట్టమైన మార్గదర్శకాలతో నూతన భవన నిర్మాణ నియమావళిని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.