సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లకు లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ఏకంగా రూ.850 కోట్లకుపైగా వసూలవుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియకు బుధవారం చివరిరోజు కావడంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు కాసుల పంట పడింది.
జీహెచ్‌ఎంసీకి ఇప్పటికే రూ.100 కోట్లురాగా, బుధవారం మరో రూ.30 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అటు హెచ్‌ఎండీఏకు రూ.600 కోట్ల ఆదాయం వచ్చిందని, అదనంగా నాలా ఫీజు కింద రూ.150 కోట్లు సమకూరవచ్చని అధికారులు వెల్లడించారు.
ఫీజు చెల్లించకుంటే తిరస్కరించినట్లే..
ఎల్‌ఆర్‌ఎస్ కోసం బుధవారంలోగా ఫీజులు చెల్లించని దరఖాస్తులను తిరస్కరించినట్లేనని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం డీడీలు ఇచ్చేవారికి వెంటనే ప్రొసీడింగ్స్ కూడా జారీ చేస్తామని.. ఫీజులు చెల్లించని వారెవరైనా వెంటనే కట్టి దరఖాస్తులను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.
ఎన్‌వోసీలు తెచ్చుకోలేక..
2015 నవంబర్‌లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రకటించింది. అనంతరం గడువు పొడిగిస్తూ వచ్చింది. అయినా ఇప్పటికీ 25 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. దరఖాస్తుదారులు రెవెన్యూ మ్యాపులు, వివిధ విభాగాల నుంచి ఎన్‌వోసీలు తెచ్చుకోలేకపోవడం వల్లే ఈ పరిస్థితి (షార్ట్‌ఫాల్స్) నెలకొందని చెబుతున్నారు. అయితే రెవెన్యూ మ్యాపుల ఇబ్బంది లేకుండా.. ఏ సర్వే నంబర్‌లో ఏ రకమైన భూములెన్ని ఉన్నాయో తెలుపుతూ రెవెన్యూ అధికారులు ఇటీవల జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇచ్చారని, దానితో ప్రభుత్వ భూముల్ని గుర్తిస్తున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
జీహెచ్‌ఎంసీలో షార్ట్‌ఫాల్స్..
ఎల్‌ఆర్‌ఎస్ కోసం జీహెచ్‌ఎంసీకి 71,793 దరఖాస్తులు రాగా.. 45 శాతం షార్ట్‌ఫాల్స్ (ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఎన్‌ఓసీలు, తదితర అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయకపోవడం) జాబితాలో చేరాయి. అర్హత లేకపోవడంతో 4,950 దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇక హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 1,74,406 దరఖాస్తులురాగా.. 91,600 దరఖాస్తులను పరిష్కరించారు. 82,006 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మాస్టర్ ప్లాన్‌లో రోడ్లు, చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లలో ఉన్నవి, సర్వే నంబర్లు లేనివి తిరస్కరణకు గురైన వాటిలో ఉన్నాయి. 800 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. తిరస్కరణకు గురైనవాటిలోనూ కొన్ని పునః పరిశీలనకు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment