సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎందుకు మాట నిలబెట్టుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలు వట్టి మాటలు అయ్యాయని ఎద్దేవా చేశారు.
కాగా, కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ఆర్ధిక భారం మోపడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై విషం చిమ్మింది. ఇప్పుడు అదే పథకాలను కాపీ కొడుతూ కాంగ్రెస్ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా లేఅవుట్‌లు క్రమబద్దీకరణ చేయాలని చూస్తోంది.
దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్‌ఆర్‌ఎస్ వద్దని కోర్టుకు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి గతంలో ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ హోదాలో NO TRS NO LRS అని ప్రకటించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఎవరు కట్టోద్దు అంటూ ప్రకటన చేశారు. అప్పుడు ఎందుకు విమర్శించారు.. ఇప్పుడెందుకు అదే పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై రభుత్వం సమాధానం చెప్పాలి.
అప్పుడు ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా ప్రజల రక్త మాంసాలు పీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా గతంలో మీరన్న మాటలే కదా?. భట్టి మాటలు వట్టి మాటలు అయ్యాయి. మధ్య తరగతి పేదల మీద 20వేల కోట్లు మోపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వసూలు చేసి భారం మోపుతోంది కాంగ్రెస్. ఈనెల 6న ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కోసం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నిరసనలు చేస్తాం. ఏడో తేదీన కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేపడుతున్నాం’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment