ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లకు గడువు పెంపు | regularisation lrs, brs deadline hike | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లకు గడువు పెంపు

Published Tue, Feb 2 2016 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

regularisation lrs, brs deadline hike

ఎన్నికల కమిషన్ అనుమతితో
మార్చి 1 వరకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
క్రమబద్ధీకరణ పథకాల గడువు నెల రోజులు పెంపు
ఇప్పటివరకు 2,20,849 ఎల్‌ఆర్‌ఎస్,
1,68,519 బీఆర్‌ఎస్ దరఖాస్తులు

 
 సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ పథకాల గడువును రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1వ తేదీ వరకు పొడిగించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో... రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతితో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలను తొలుత 60 రోజుల గడువుతో గత నవంబర్ 2న అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ గడువు డిసెంబర్ 31తో ముగియడంతో.. నెల రోజులు గడువు పెంచారు. ఈ పెంపు గడువు కూడా గత నెల 31తోనే ముగియగా తిరిగి మరో నెల రోజులు పొడిగించారు.

 ఇప్పటిదాకా రూ.309 కోట్ల ఆదాయం
 ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఫిబ్రవరి 1వ తేదీ నాటికి చెల్లించిన సొమ్ము రూ.309.77 కోట్లకు చేరింది. ఫిబ్రవరి 1 నాటికి మొత్తంగా 2,20,849 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, 1,68,519 బీఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల నుంచి రూ.175.90 కోట్లు, బీఆర్‌ఎస్ దరఖాస్తుదారుల నుంచి రూ.133.87 కోట్ల ఆదాయం ఖజానాకు జమ అయింది. నిబంధనల మేరకు ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ దరఖాస్తుతో పాటు కనీసం 50 శాతం క్రమబద్ధీకరణ చార్జీలనుగానీ లేదా రూ.10 వేలు గానీ ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే అధిక శాతం దరఖాస్తుదారులు రూ.10 వేలు మాత్రమే చెల్లించారు. ఈ లెక్కన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తే ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం రూ. వెయ్యి కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 లక్షకు మించిన ‘గ్రేటర్’ దరఖాస్తులు
 జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ దరఖాస్తుల సంఖ్య లక్షను దాటింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,10,489 బీఆర్‌ఎస్, 54,933 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు రాగా... హెచ్‌ఎండీఏ పరిధిలో 92,681 ఎల్‌ఆర్‌ఎస్, 29,562 బీఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు పథకాలు కలిపి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీకి రూ.126.12 కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.96.22 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక రాష్ట్రంలోని ఇతర పురపాలికల విషయాన్ని పరిశీలిస్తే.. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో 19,092 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో 54,143 ఎల్‌ఆర్‌ఎస్, 28,468 బీఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. కుడాకు రూ.1.96 కోట్లు, డీటీసీపీకు రూ.85.46 కోట్ల ఆదాయం వచ్చింది.
 
 రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య, ఆదాయం (రూ.కోట్లలో)
                  దరఖాస్తులు        ఆదాయం
 ఎల్‌ఆర్‌ఎస్    2,20,849    175.90
 బీఆర్‌ఎస్    1,68,519    133.87
 మొత్తం        3,89,368    309.77

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement