
సాక్షి, హైదరాబాద్ : లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి గడువును ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నవంబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టగా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో లక్షలాదిగా దరఖాస్తులొచ్చాయి.
ఫిబ్రవరి 28లోగా ఈ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధిస్తూ గత జనవరి 8న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పెండింగ్ ఎల్‌ఆర్ దరఖాస్తుల పరిష్కారానికి పురపాలికలు చర్యలు తీసుకుంటున్నాయి. దరఖాస్తుల్లో లోపించిన సమాచారంతో పాటు ఫీజు బకాయిలు చెల్లించాలని దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చాయి. దరఖాస్తుదారులు సైతం అదనపు సమాచారంతో పాటు ఫీజు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment