రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అనధికార లేఅవుట్‌లకు అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం యోచిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అనధికార లేఅవుట్‌లకు అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం యోచిస్తోంది. అలాంటి ప్లాట్లను రిజిష్టర్ చేయకుండా తమిళనాడు ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాన్ని పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మన రాష్ట్రంలో పలుచోట్ల పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీల అనుమతి లేకుండా కొందరు వ్యాపారులు లేఅవుట్‌లు ఏర్పాటు చేసి, అక్కడ ఎలాంటి సౌకర్యాలూ కల్పించకుండానే ప్రజలకు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్లాట్లు ఉన్నవే దాదాపు నాలుగైదు వేల లేఅవుట్‌లు ఉంటాయని అంచనా.
అయితే వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పురపాలక శాఖ వద్ద లేకపోవడం గమనార్హం.
వాటిలో 2008 జనవరి నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ప్లాట్లలో నిర్మాణాలు సహా ఎలాంటి అనుమతీ రావట్లేదు. 2008 జనవరి నెల ముందు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు మాత్రం ‘అనధికార లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం’ (ఎల్‌ఆర్‌ఎస్) కింద జరిమానాతో క్రమబద్ధీకరించి, నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే గడువునూ ప్రభుత్వం గత మే నెలలోనే నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అనధికార లేఅవుట్‌లనేవే ఇకపై ఏర్పాటుగాకుండా ఉండాలంటే వాటికి రిజిస్ట్రేషన్లే లేకుండా చేయడమే మంచిదన్న పురపాలక శాఖ సూచించింది.
తమిళనాడులో ఇలా: ఇటీవల స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ విభాగం కమిషనర్ విజయకుమార్ చెన్నైకు వెళ్లి, అక్కడ తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అక్కడ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటే స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీల నుంచి ఆ లేఅవుట్‌కు పూర్తి అనుమతి ఉండాలి. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి అభ్యంతరమూ లేదని ధ్రువీకరించాలి. లేని పక్షంలో అనుమతినిచ్చిన లేఅవుట్ పత్రాలను సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖలో అందుబాటులో ఉంచాలి. అప్పుడే ఆ సదరు ప్లాట్‌కు రిజిస్ట్రేషన్ చేస్తారు.