* ఇళ్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ తప్పనిసరి
* ఫీజు చెల్లించాల్సిందే అంటున్న అధికారులు
* లబోదిబోమంటున్న ఇళ్ల యజమానులు
* హెచ్‌ఎండీఏ తీరుపై నిరసనల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: నిబంధనలను అతిక్రమించి నిర్మించుకున్న భవనాలను బీఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించుకునేందుకు వెళ్లిన ఇంటి యజమానులకు హెచ్‌ఎండీఏలో చుక్కెదురవుతోంది. మొదట లేఅవుట్ రెగ్యులైరె జేషన్(ఎల్‌ఆర్‌ఎస్) చేసుకుంటేనే... ఆ తర్వాత బీఆర్‌ఎస్ కింద ఇంటిని క్రమబద్ధీకరిస్తామంటూ అధికారులు మెలిక పెడుతున్నారు. ఎప్పుడో... 25 ఏళ్ల క్రితం వేసిన లేఅవుట్‌కు ఇప్పుడు ఫీజు చెల్లించమనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తే... తామేమీ చేయలేమంటూ ప్రభుత్వ జీఓను చూపిస్తున్నారు. దీంతో షాక్‌కు గురైన లబ్ధిదారులు చేసేదేమీలేక తిరుగుముఖం పడుతున్నాడు. బీఆర్‌ఎస్ కింద ఇంటి క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికి.. లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఫీజునూ జత చేస్తుండటంతో అంతమొత్తాన్ని చెల్లించలేక చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. దీంతో హెచ్‌ఎండీఏ ఖజానాకు రావాల్సిన డబ్బు కూడా రాకుండా పోతోంది.
ఖాళీ స్థలం లేదంటూ...
కాలనీలో పార్కులు, ఆట స్థలాల కోసం ఖాళీ స్థలాలు వదల్లేదంటూ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. ఓపెన్ స్పేస్ వదిలి ఉంటే ఆ మేరకు ఇప్పుడు మీకు ఫీజులో మినహాయింపు ఇచ్చేవారమంటున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లకు గ్రామ పంచాయతీలే అనుమతులిచ్చాయి. ఖాళీ స్థలాల గురించి అప్పట్లో వారు పెద్దగా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రోడ్లకు స్థలం వదిలారా? లేదా? అన్నది చూసి అనుమతులిచ్చేశారు. ఇలాంటి కాలనీల్లో గ్రామపంచాయతీకి ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా చిన్నచిన్న మార్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నవారు, అనుమతి లేకుండా పెంట్ హౌస్ కట్టుకున్నవారు ఇప్పుడు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఫీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, మణికొండ, ప్రగతినగర్ గ్రామ పంచాయతీల పరిధిలో కొందరు బిల్డర్లు అపార్టుమెంట్లలో ఫ్లాట్లు విక్రయించేటప్పుడే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బు వసూలు చేసి ఆ మొత్తాన్ని కట్టకుండానే కాజేశారు. మరికొందరు డెవలపర్స్ లేఅవుట్‌లో రోడ్లు, పార్కు, గ్రౌండ్స్ కోసం స్థలం వదిలినట్లు చూపి ఆ తర్వాత వాటిని కూడా ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు. ఇలా డెవలపర్ చేసిన పొరపాట్లు ఇప్పుడు ఇంటి యజమానులకు శాపంగా మారాయి. ఇలాంటి ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ససేమిరా అంటుండటంతో పలువురు నెత్తీనోరు బాదుకుంటున్నారు. రెగ్యులరైజేషన్ పేరుతో మళ్లీ లక్షల రూపాయలు చెల్లించమని హెచ్‌ఎండీఏ నోటీసులు పంపుతుండడం శివారు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
50 లక్షలకు.. వచ్చింది 20 వేల దరఖాస్తులే...?
క్రమబద్ధీకరణ కోసం అసలు దరఖాస్తు చేసుకోని వారిని వదిలేసి, ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చిన వారికి సవాలక్ష ఆంక్షలు విధిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ కింద మొత్తం 50 లక్షలకు పైగా దరఖాస్తులు రావాల్సి ఉండగా, క్రమబద్ధీకరణ కోరుతూ ఇప్పటివరకు 20 వేల దరఖాస్తులు మాత్రమే వ చ్చాయి. క్రమబద్ధీకరణ గడువు ముగిశాక అక్రమ నిర్మాణాలు, లే అవుట్ల కూల్చివేతకు చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నా... శివారు ప్రాంత ప్రజలు ఖాతరు చేయడం లేదు. అపార్టుమెంట్లలో రెగ్యులరైజ్ చేసుకోని వారికి ఆస్తిపన్ను రూ.2 వేల స్థానంలో రూ.10 వేలు విధించి కొన్నేళ్లపాటు వసూలు చేస్తామని, నీళ్లు, విద్యుత్, డ్రైనేజి కనెక్షన్ తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదేం మెలిక..!
Published Thu, Dec 24 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM
Advertisement
Advertisement