జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశం
వేగంగా ప్రక్రియ చేపట్టాలి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలి
నిబంధనల ప్రకారమే క్రమబద్దీకరణ.. అక్రమాలకు తావు ఇవ్వొద్దు
ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లొద్దు
ప్రజల సందేహాలను తీర్చేందుకు హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేయాలని సూచన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ నుంచి సమీక్షించిన మంత్రి
ఖమ్మం నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్/ భూపాలపల్లి/ సాక్షిప్రతినిధి, ఖమ్మం: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని.. మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారం మాత్రమే క్రమబద్దీకరణ జరగాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి అక్కడి కలెక్టరేట్ నుంచి మున్సిపల్, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధనశాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ప్రత్యేక బృందాలతో ప్రక్రియ
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో దళారుల ప్రమేయం లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ‘‘పెండింగ్‌లో ఉన్న 25.70 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలి. సిబ్బంది కొరత ఉన్నచోట ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలి. ప్రతిపాదనలు పంపితే రెవెన్యూ శాఖ నుంచి కూడా సర్దుబాటు చేస్తాం. రెవెన్యూ, సాగునీరు, మున్సిపల్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలి.
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్‌డెసు్కలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో పాలుపంచుకునే అధికారులు, సిబ్బందికి తక్షణమే శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా అవసరమైన కా ర్యాచరణ చేపట్టాలి..’’అని మంత్రి ఆదేశించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో క్రమబద్దీకరణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పొంగులేటి సూచించారు.
ప్రజలకు ఇబ్బంది కలగొద్దు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దరఖాస్తుల స్క్రూటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని.. నీటి వనరులు, కాలువలు, చెరువుల ఆక్రమణలకు పాల్పడకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment