సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకా నికి (ఎల్‌ఆర్‌ఎస్) ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకోసం లేఅవుట్ల క్రమబ ద్ధీకరణ నిబంధనలు–2020ను ప్రకటిం చింది. రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల తరఫున సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా మంగళవారం జీవో 131ను బహిర్గతం చేశారు.
నో అప్రూవల్... నో రిజిస్ట్రేషన్
రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలు ప్రణాళికా బద్ధమైన సుస్థిరాభివృద్ధిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన లేఅవుట్లను ప్రోత్సహిస్తోంది. అయితే అక్రమ, అనధికార లేఅవుట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం స్థానిక సంస్థలకు భారంగా మారడంతోపాటు ప్లాట్ల యజమానులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి అక్రమ, అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయబోమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా అనధికార, అక్రమ లేఅవుట్లను ప్రణాళికాబద్ధమైన సుస్థిర అభివృద్ధి పరిధిలోకి తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్లాట్ల యజమానుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు– 2020ను తీసుకొచ్చినట్లు తెలిపింది. 2020 ఆగస్టు 31 నుంచి ఈ నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను నిషేధించడంతోపాటు భవన నిర్మాణాలకు సైతం అను మతులు జారీ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా స్థలాలను మిగతా క్రమబద్ధీకరించుకుంటేనే రిజిస్ట్రేషన్/విక్రయాలు/భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాలనే మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్తింపు...
హైదరాబాద్ మహానగరాభివృద్ఢి సంస్థ (హెచ్‌ఎండీఏ), పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ), నగర/పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లోని స్థలాలకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) వర్తించనుంది. ఎల్‌ఆర్‌ఎస్ అమలు ప్రక్రియను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు గ్రామ పంచాయతీల్లో కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక అభివృద్ధికి ఉపయోగించనున్నారు.
క్రమబద్ధీకరణ వర్తింపు వీటికే...
భూ యజమానులు/ప్రైవేటు డెవలపర్లు/సంస్థలు/కంపెనీలు/ప్రాపర్టీ డెవలపర్లు/సొసైటీలు అనుమతి తీసుకోకుండా చేసిన ప్లాట్ల విభజనలన్నింటికీ, ఏర్పాటు చేసిన అన్ని లేఅవుట్లు/వెంచర్లకు ఈ రెండు సందర్భాల్లో ఆధారంగా ఈ రూల్స్ వర్తిస్తాయి. 1) రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ప్లాట్లు విక్రయిస్తే 2) అనధికారికంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లలో కనీసం 10 శాతం ప్లాట్లు 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించిన వాటికి.
– పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం, తెలంగాణ భూ సంస్కరణల చట్టం (వ్యవసాయ భూములపై పరిమితి) కింద సంబంధిత ప్రభుత్వ విభాగం నుంచి క్లియరెన్స్ కలిగి ఉండటంతోపాటు నిషేధిత భూముల రిజిస్టర్‌లో నమోదు కాని స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. అసైన్డ్ భూముల విషయంలో జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి.
– 10 హెక్టార్లకంటే ఎక్కువ విస్తీర్ణంలోని జలాశయాలు, కుంటలు, చెరువుల సరిహద్దు నుంచి 30 మీటర్ల తర్వాత ఉన్న స్థలాలకే క్రమబద్ధీకరించుకొనే వెసులుబాటు ఉంటుంది.
– 10 హెక్టార్ల విస్తీర్ణం కంటే తక్కువ ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, శిఖానికి 9 మీటర్ల తర్వాత ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తారు.
– కాలువలు, వాగుల సరిహద్దుల నుంచి 9 మీటర్ల దూరం, నాలా సరిహద్దుకు 2 మీటర్ల దూరం ఉన్న ప్లాట్లకే క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది.
– విమానాశ్రయాలు, రక్షణ ప్రాంతాల పరిసరాల్లోని స్థలాల క్రమబద్ధీకరణపై ఆంక్షలు వర్తింపజేస్తారు. ఆ భూముల సరిహద్దు నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలంటే ఆయా సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరి.
– జంట జలాశయాల పరిధిలో 111 జీవో ఉత్తర్వులపై ఎలాంటి సడలింపుల్లేవు. ఆ జీవోకు అనుగుణంగా ఉన్న ప్లాట్లనే క్రమబద్ధీకరిస్తారు.
క్రమబద్ధీకరణ పరిధిలోకి రానివి...
– మాస్టర్‌ప్లాన్‌లో పరిశ్రమలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్, రిక్రియేషనల్ జోన్, నీటివనరులు, ఓపెన్ స్పేస్‌గా నిర్దేశించిన ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదు.
– వివాదాస్పద, దేవాదాయ, వక్ఫ్, శిఖం, ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో ఉన్న స్థలాలు కూడా క్రమబద్ధీకరణకు అనర్హమైనవి.
కటాఫ్ తేదీ ఎప్పుడు?
ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ వర్తించనుంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్/టైటిల్ డీడ్, సైట్ ప్లాన్, రెవెన్యూ స్కెచ్, మార్కెట్ విలువ, లేఅవుట్ నకలు, లొకేషన్ స్కెచ్, ఇండెమ్నిటీ బాండ్, నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) జతపరచాలి.
దరఖాస్తులకు గడువు: అక్టోబర్ 15 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. మీసేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ), కామన్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ (త్వరలోనే అందుబాటులోకి)
– లేఅవుట్‌లో అమ్ముడుపోని ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్‌లను లేఅవుట్ యజమాని సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్లాట్ ఓనర్ అయితే రూ. 1,000, లేఅవుట్ యజమాని రూ. 10,000 ప్రాసెసింగ్ ఫీజు కింద దరఖాస్తుతోపాటు చెల్లించాల్సి ఉంటుంది.
ఎప్పటివరకు చెల్లించాలి?
ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆమోదం పొందిన స్థలాలకు నిర్దేశిత మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి 31 నాటికి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తేదీని పరిగణనలోకి తీసుకొని ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజును వసూలు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఆగస్ట్ 26 వరకు ఉన్న సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోనున్నారు.
కనీస క్రమబద్ధీకరణ చార్జీలు
ప్లాట్ల వైశాల్యం (చ.మీ.లలో) రుసుం (చ.మీ./రూ.లలో)
100లోపు 200
101–300 400
301–500 600
500పైనా 750
మురికివాడల్లో రూ. 5 (వైశాల్యంతో సంబంధం లేకుండా)
కనీస క్రమబద్ధీకరణ రుసుం అంటే బెటర్‌మెంట్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీలు, లేఅవుట్ స్క్రూటిని చార్జీలు, జరిమానా, ఇతర చార్జీలు కలుపుకొని ఉంటాయి.
భూముల మార్కెట్ విలువ ఆధారంగా నిర్దేశించిన క్రమబద్ధీకరణ రుసుం
స్థల వైశాల్యం (చ.గజాల్లో) రుసుం (శాతం)
3,000లోపు 25
3,001–5,000 50
5,001–10,000 70
10,001పైనా 100
– అనధికార లేఅవుట్‌లో 10 శాతం ఓపెన్ స్పేస్ అందుబాటులో లేకపోతే ప్లాటు విలువలో అదనంగా 14% ఓపెన్ స్పేస్ చార్జీలను వసూలు చేస్తారు.
ఆగస్టు 26 నాటికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ స్థలం వైశాల్యాన్ని బట్టి శాతాలుగా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు.
నోట్: అసలైన క్రమబద్ధీకరణ చార్జీలు అంటే కనీస క్రమబద్ధీకరణ రుసుములతోపాటు ఆగస్టు 26 నాటికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆ స్థలం వైశాల్యాన్ని బట్టి శాతాలుగా పరిగణనలోకి తీసుకొని రుసుములు విధిస్తారు.
పంచాయతీల్లో తొలిసారిగా..
స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అధికారం తొలుత పురపాలకశాఖకే ఉండేది. రెండేళ్ల క్రితం సర్కారు చేసిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని వర్తింపజేసేలా పంచాయతీరాజ్ శాఖకు అధికారం లభించింది. సెక్షన్ 113 ప్రకారం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించే వెసులుబాటు లభించడంతో పంచాయతీల్లో తొలిసారిగా స్థలాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది.
రూ. 10 వేల కోట్ల ఆదాయం!
రాష్ట్ర ఖజానాకు ఎల్‌ఆర్‌ఎస్ కాసుల పంట పండించనుంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ పథకం భారీగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్ తప్పనిసరి చేయడం, గ్రామ పంచాయతీల్లోనూ ఈ పథకాన్ని వర్తింపజేస్తుండటంతో సర్కారుకు రూ. 10 వేల కోట్ల రాబడి రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరణ రుసుం పెంపు, ప్రస్తుత మార్కెట్ విలువనే పరిగణనలోకి తీసుకుంటుండటం, ప్రతి అనధికార ప్లాటు దాదాపుగా ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరనుంది. ఇప్పటివరకు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఎల్‌ఆర్‌ఎస్ వర్తింపజేసిన ప్రభుత్వం.. ఈసారి గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తింపజేయడంతో ఈ పథకం ప్రభుత్వానికి కాసులు కురిపించనుంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో పట్టణీకరణ శరవేగంగా సాగింది. ఈ క్రమంలో పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. దీంతో వాటిల్లో స్థలాలు కొన్న వారు తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment