మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలక శాఖ
గతప్రభుత్వ హయాంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు
కోర్టు కేసులతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పథకం
తాజాగా వాటిని క్లియర్ చేయాలని సర్కారు నిర్ణయం
మూడు దశల్లో ప్రక్రియ.. ఇందుకోసం ప్రత్యేక అప్లికేషన్
ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన..
నేడు ఈ అంశంపై అధికారులు, కలెక్టర్లతో సమీక్షించనున్న సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు రంగం సిద్ధమవుతోంది. గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రకటించగా.. 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దర ఖాస్తులకు రూ.1,000 చొప్పున ఫీజు తీసుకుంది. క్రమబదీ్ధకరణ కోసం చార్జీలను నిర్ణయించి, ప్రక్రియ ప్రారంభించింది. కానీ కోర్టు కేసుల వల్ల అది నిలిచిపోయింది. అప్పటి నుంచి లక్ష లాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్‌ఆర్‌ఎస్ విష యంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని పలుమార్లు ప్రకటించింది. తాజాగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో ఉన్న లేఅవుట్ల క్రమబదీ్ధకరణకు అనుమతిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల సమస్యను పరిష్కరించే దిశగా నిబంధనలను సరళీకరిస్తూ.. పెండింగ్ దరఖాస్తుల ఆమోదానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగిస్తామని పేర్కొంది.
దరఖాస్తుల వడబోత 3దశల్లో..
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మూడు దశల్లో వడపోయనున్నారు. తొలిదశలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్లికేషన్ ఆధారంగా పరిశీలన జరుపుతారు. వివాదాస్పద, ప్రభుత్వ భూముల్లో ఉండే లేఅవుట్లకు సంబంధించి ఈ దశలోనే అనుమతులు నిలిచిపోతాయి. ఇందుకోసం ధరణిలో పేర్కొన్న వివరాలను, సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలిస్తారు. లేఅవుట్ వేసిన భూమి పూర్తి వివరాలను గుర్తిస్తారు. అలాగే ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు.
ఈ బృందంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, ప్రణాళిక సూపర్‌వైజర్, పంచాయతీ ఈవో, యూఎల్‌బీ సిబ్బంది ఉంటారు. ఈ బృందాలు లేఅవుట్ ఉన్న భూమి ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, చెరువులు, కుంటలకు సంబంధించినదా, సీలింగ్, కోర్టు వివాదాలు ఉన్నదా అన్న వివరాలను పరిశీలిస్తాయి. ఈ డేటా నమోదు చేయడానికి మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
రెండోదశలో సీపీవో, టీపీవో, డీపీవో పరిశీలన..
మొదటి దశ వడపోత దాటి వచ్చే దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీ అధికారులు పరిశీలిస్తారు. రెండో దశలో లేఅవుట్, రోడ్లు, జోన్ నిబంధనల ఉల్లంఘన, ఖాళీ స్థలాలను వదిలేయడం వంటి సాంకేతిక విషయాలను పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే.. ఆయా దరఖాస్తులకు సంబంధించి క్రమబద్ధీకరణ ఫీజును నిర్ణయిస్తారు. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తులు మూడోదశకు వెళతాయి.
మూడోదశలో ఉన్నత స్థాయి సమీక్ష
మూడో దశలో దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పరిశీలిస్తారు. ఏవైనా లోపాలను గుర్తిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుంటే చివరగా అనుమతి కోసం పంపుతారు.
ఆమోదానికి చొరవ చూపాలంటూ..
ఆగస్టు మొదటి వారం నుంచే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని.. మూడు నెలల్లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్ సమస్యను అధిగమించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, రిజి్రస్టేషన్ శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment