సాక్షి, సిటీబ్యూరో: ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ వ్యవహారాన్ని హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్ వ్యవస్థ బట్టబయలు చేసింది. అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఆ ఉద్యోగి డబ్బు మరిగి ఈ అవినీతికి తెర తీశాడు. చివరకు దొంగ బయటపడ్డాడు.
అసలేం జరిగిందంటే...
సంగారెడ్డి కల్వకుంట్ల గ్రామం సర్వే నంబర్ 199లోని 272 గజాలస్థలాన్ని ఎల్‌ఆర్‌ఎస్ చేయాలంటూ వంటేర్ హేమలత 2016లో హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశారు. అయితే అధికారులు మరికొన్ని పత్రాలు సమర్పించాలని 114122 నెంబర్ కేటాయిస్తూ ఆన్‌లైన్‌లో షార్ట్‌ఫాల్ పంపారు. అయితే హేమలత వాటిని ఆప్‌లోడ్ చేయకపోవడంతో దరఖాస్తును తిరస్కరించారు. అక్కడితో ఆ కథ అలా ఆగిపోయింది. అయితే వారం క్రితం హత్నూర మండల్ బొరపాట్ల గ్రామానికి చెందిన ఎస్.శంకరయ్య.. హేమలతకు చెందని స్థలాన్ని పరిశీలించాలని హెచ్‌ఎండీఏ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాడు.
శంకరయ్య ఎందుకు కోరాడంటే...
199లోని 272 గజాల స్థలాన్ని శంకరయ్య కొనుగోలు చేశాడు. అందుకే హెచ్‌ఎండీఏను సంప్రదించి ఆ స్థలం వ్యవహారం పరిశీలించాలని కోరాడు. అయితే 2016లోనే దరఖాస్తు తిరస్కరణకు గురైందని అధికారులు తేల్చేశారు. దీంతో శంకరయ్య ఖంగుతిని అధికారులకు ఫిర్యాదు చేయడంతో హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు విచారణకు ఆదేశించారు.
ఇదీ జరిగింది..
వంటేర్ హేమలత ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న తరువాత 2016 మార్చిలో బీహెచ్‌ఈఎల్‌కు చెందిన కె.అంజనేయులు గౌడ్‌కు విక్రయించింది. తరువాత ఆయన ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించామని హెచ్‌ఎండీఏ నుంచి ఆంజనేయులుకు ఎస్‌ఎంఎస్ వచ్చింది. ఈ విషయంపై రియల్ ఎస్టేట్ ఏజెంట్ గాజుల రాజేశంను సంప్రదించాడు. రూ.30 వేలు ఇవ్వడంతోపాటు రూ.59.278 డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాడు. తరువాత నకిలీ డ్రాఫ్ట్ అందజేశాడు. విషయం తెలియని అంజనేయులు గౌడ్ గత సెప్టెంబర్‌లో ఈ ప్లాట్‌ను శంకరయ్యకు విక్రయించాడు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పనే...
శంకరయ్య హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని సంప్రదించడంతో రాజేశం బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రొసిడింగ్స్‌లో జేపీవో డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినట్టు తెలిసింది. దీంతో హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగ అధికారులు రాజేశంను తీసుకొచ్చి విచారించగా హెచ్‌ఎండీఉఏలో జూనియర్ ప్లానింగ్ పర్సన్(ఔట్ సోర్సింగ్) ఉద్యోగి సైదులు డబ్బులు తీసుకొని నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ ప్రోసిడింగ్స్ చేతికి అందించాడని తెలిపాడు. దీనిపై హెచ్‌ఎండీఏ ప్లానింగ్ అధికారి బి.బీమ్‌రావు ఓయూ పోలీసు స్టేషన్ గురువారం ఫిర్యాదు చేశారు. హెచ్‌ఎండీఏతో పాటు ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించే దిశగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే 040–27018115/6/7/8 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు.
దొంగను పట్టిచ్చిన.. ‘ఆన్‌లైన్’
Published Fri, Jan 26 2018 4:55 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment