‘పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులన్నింటినీ 15రోజుల్లో పరిశీలించి, అన్నీ సవ్యంగా ఉంటే ఫీజు చెల్లింపు నోటీసులు, తిరస్కరించిన వాటికి లేఖలు అందించాలి. ఈ ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తిచేసి అనుమతి పత్రాలు మంజూరు చేయాలి. లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ – ఇటీవల హైదరాబాద్‌లో మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం
గద్వాల : పట్టణాల్లో స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. గడువులోపు దరఖాస్తులు చేసి ఫీజు చెల్లించినా పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గద్వాల మున్సిపాలిటీ, అయిజ నగర పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు సగమైనా పూర్తి చేయలేదు. లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ఉంటేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తామని అధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొదట 2015 అక్టోబరు నాటికి రిజిస్టరైన లే–అవుట్ లేని స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
రెండోసారి 2016 డిసెంబర్31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ముచ్చటగా మూడోసారి పెద్దనోట్ల రద్దు తర్వాత అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవడానికి మళ్లీ అవకాశం కల్పించింది. తాజాగా ఫిబ్రవరి వరకు గడువు పెంచింది. ఇంతవరకు తిరస్కరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు లేఖలు, అనుమతించిన వారికి ఫీజు చెల్లింపు నోటీసులు వచ్చే నెల 5లోగా అందించాలని సూచించింది. అర్హులైన దరఖాస్తుదారులు 15రోజుల్లోగా మిగతా అపరాధ సొమ్ము చెల్లిస్తే అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంది.
గట్టిగా నిలదీస్తే కొర్రీలు..
వాస్తవానికి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు సమయంలో రూ.పది వేలు ఫీజు చెల్లించారు. ఇందులో ఇండస్ట్రియల్, రిక్విజేషన్, రోడ్డు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నావారు లేకపోలేదు. దీంతో కొందరు దరఖాస్తుదారులను అధికారులు నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏమిటని గట్టిగా నిలదీస్తే అనేక కొర్రీలు పెడుతున్నారు. మరికొందరు దరఖాస్తుదారులకు మొత్తం ఫీజు చెల్లించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. భవన నిర్మాణాలు చేపట్టేవారికి కొందరు కౌన్సిలర్లు అండగా నిలుస్తున్నారు. పెద్ద మొత్తంలో క్రమబద్ధీకరణకు చెల్లించడం దండగ అని, తమకు ఎంతో కొంత ముట్టజెబితే వాటి జోలికి అధికారులు రాకుండా చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు.
ఎన్నో ప్రయోజనాలు..
ఎల్‌ఆర్‌ఎస్ ఉంటే బ్యాంకు రుణాలు ఇళ్లకేగాక స్థలాలపైనా తీసుకోవచ్చు. ఇల్లు నిర్మించుకోవాలన్నా క్రమబద్ధీకరించిన స్థలానికి సులువవుతుంది. నూతన నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు వెంటనే వస్తాయి. స్థలాన్ని ఇతరులకు విక్రయించడం ఎంతో సులభం. స్థలం కబ్జాకు గురికాకుండా ఉంటుంది. ఈ అంశాలపై ప్రజలకు మున్సిపల్ అధికారులు ఎక్కువగా అవగాహన కల్పించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment