గచ్చిబౌలి: నగరంలో వ్యర్థాల సమస్య తీరని వ్యధగా మారింది. చెత్తను ఇష్టానుసారంగా పడేస్తుండడంతో అవి నాలాలు, డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయి మురుగునీరు రోడ్లపై పారుతోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ముంపు సమస్య ఏర్పడుతోంది. దీన్ని పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్నకార్యక్రమంతో ముందుకెళ్తోంది. 10 కంపెనీలతో కలిసి ‘10డీ రీసైక్లథాన్–2019’ పేరుతో నవంబర్ 3–13 వరకు వెస్ట్‌జోన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. దీన్ని వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన దాసరి పర్యవేక్షిస్తున్నారు. విద్యాసంస్థలు, కాలనీలు, ఐటీ కంపెనీలలో డ్రై, ఈ–వేస్ట్ సేకరించేందుకు కార్యాచరణ రూపొందించారు. శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్‌చెరు, యూసుఫ్‌గూడ సర్కిళ్ల పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్ట్ చేయనున్న వ్యర్థాలను తీసుకునేందుకు ఐటీసీ, సన్‌శోధన్, రద్దీ కనెక్ట్, రాంకీ ఫౌండేషన్, గోద్రేజ్, మై స్క్రాబ్ బిన్ తదితర కంపెనీలు ముందుకొచ్చాయి. పాత మ్యాట్రెసెస్, బెడ్‌షీట్స్, కుర్చీలు, లెదర్ వస్తువులు, ఐరన్ స్క్రాబ్, పుస్తకాలు, పేపర్లు తదితర వస్తువులను డ్రై–వేస్ట్‌గా పరిగణిస్తారు. ఐటీ కంపెనీలలో వృథాగా పడి ఉండే ఎలక్ట్రానిక్,ఎలక్ట్రికల్ వస్తువులను ఈ–వేస్ట్‌గా పేర్కొంటారు. ముఖ్యంగా పాత సామాన్లను ఎక్కడ పడేయాలో తెలియక చాలామంది నాలాల్లో వేస్తున్నారు. అంతే కాకుండా ప్లాస్టిక్ కవర్లు నిత్యం భారీగా నాలాల్లో చేరుతున్నాయి. ఇవన్నీ మురుగు నీటి ప్రవాహనికి అడ్డంకిగా మారుతున్నాయి. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగి ప్రధాన రహదారులతో పాటు కాలనీలు మురికికూపాలు అవుతున్నాయి. ప్రజలు అవగాహన లోపంతో ఇలా చేస్తుండడంతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని నివారించాలని వ్యర్థాల సేకరణ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన సర్కిల్‌అధికారులను ఆదేశించారు.
ఎక్కవ సేకరిస్తే బహుమతులు
ఎక్కువ డ్రై వేస్ట్‌ను సేకరించి తీసుకొచ్చే విద్యార్థులకు పుస్తకాలు, జూట్ బ్యాగ్‌లు, మొక్కలను బహుమతిగా ఇస్తాం. రీసైక్లింగ్ వేస్టేజీపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తాం. రీసైక్లింగ్‌కు ఉపయోగపడే చెత్తను సేకరించి కంపెనీలకు అందజేస్తాం. మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్, ఇతర ఐటీ కంపెనీలతో పాటు కాలనీల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఈ–వేస్ట్ సేకరిస్తాం. ఇక డ్రై–వేస్ట్‌ను విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సేకరిస్తాం. ఎక్కువ మొత్తంలో వేస్టేజీ ఉంటే ఫోన్ చేస్తే వాహనాలు వస్తాయి. లేదంటే డివిజన్‌లలో ఏర్పాటు చేసే కలెక్షన్ సెంటర్లలో అందజేయాలి. ప్రజల సహకారంతోనే 10డీ రీసైక్లథాన్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం. – హరిచందన దాసరి, వెస్ట్‌జోన్ కమిషనర్
ఒక్కో డివిజన్‌కు రెండు...
⇒ జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో 18 డివిజన్‌లు ఉన్నాయి. డివిజన్‌కు రెండు చొప్పున 36డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వాటి వివరాలివీ...
⇒ శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అంజయ్యనగర్, కొత్తగూడ, గౌలిదొడ్డి, గుల్మోహర్ కాలనీ, మసీద్‌బండ, గోపీనగర్‌లలోని కమ్యూనిటీ హళ్లు.
⇒ చందానగర్ సర్కిల్ పరిధిలో మాదాపూర్ వార్డు ఆఫీస్, మియాపూర్ బస్ బాడీ యూనిట్, హఫీజ్‌పేట్ వార్డు ఆఫీస్, చందానగర్ కల్యాణ మండపం, హుడా కాలనీ కమ్యూనిటీ హాల్.
⇒ పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో ఎల్‌ఐజీ సొసైటీ ఆఫీస్, విద్యాభారతి స్కూల్, పటాన్‌చెరు చైతన్యనగర్, శాంతినగర్ కమ్యూనిటీ హాల్.
⇒ యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలో వెంకటగిరి కృష్ణానగర్, ఎల్‌ఎన్‌నగర్ గణపతి కాంప్లెక్స్, మధురానగర్, జవహర్‌నగర్, రాజీవ్‌నగర్, బంజారానగర్, రహమత్‌నగర్, కార్మికనగర్, ఎస్‌ఆర్‌టీనగర్, ఎస్‌ఆర్‌ఆర్‌పురం సైట్–3.
⇒ వీటితో పాటు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బిన్‌లను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా కాలనీల్లోనూ ప్రత్యేక వాహనాలు తిరుగుతూ డ్రై వేస్ట్‌ను సేకరిస్తాయి.
⇒ ఎవరైనా డ్రై, ఈ–వేస్ట్‌ను తీసుకోవాలనుకున్నా.. ఇవ్వాలనుకున్నా డాక్టర్ బిందు భార్గవి (శేరిలింగంపల్లి సర్కిల్) 79950 79809, డాక్టర్ రవికుమార్ (చందానగర్, యూసుఫ్‌గూడ సర్కిల్) 80085 54962, డాక్టర్ లక్ష్మణ్ (పటాన్‌చెరు సర్కిల్) 94410 46896 నంబర్లలో సంప్రదించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment