
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల్లో అవకతవకల నిరోధానికి ప్రవేశపెట్టిన ‘టీమ్’ (టాస్క్ ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్ అండ్ మానిటరింగ్) యాప్ అటకెక్కింది. యాప్‌ను అట్టహాసంగా ప్రారంభించినా ఆనక దాని ఉనికినే పట్టించుకోవడం మానేశారు. ఇప్పటి దాకా యాప్ ద్వారా పనులు నమోదు చేయకుండా పాతపద్ధతి (మెజర్‌మెంట్స్ బుక్స్)లోనే పనుల నమోదు, బిల్లుల చెల్లింపు చేస్తున్నారు. ఈ యాప్ వినియోగం ద్వారా ప్రతి పనికి కచ్చితమైన లెక్కతోపాటు పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, నిధులు దుబారా కాకుండా చూసేందుకు వీలుంటుందని అధికారులు ప్రకటించారు.
మెజర్‌మెంట్ బుక్స్(ఎంబీ)లో వివరాలను కాంట్రాక్టర్లే నమోదు చేయడం.. సంబంధిత ఇంజినీర్లు సైతం పరస్పర సహకారంతో సంతకాలు పెట్టడం వంటి చర్యల వల్ల జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ‘టీమ్’ యాప్‌తో దాన్ని కట్టడి చేయవచ్చని భావించారు. వర్క్ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు పురోగతిని ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయడం.. బిల్లుల చెల్లింపు సైతం యాప్ లెక్కల మేరకే ఆన్ లైన్‌లో చేస్తామని ఆగస్టులో యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు ప్రకటించారు. వాస్తవానికి గత జనవరిలోనే ఈ యాప్‌ను ప్రారంభిస్తామని చెప్పినా, ఎనిమిది నెలల జాప్యంతో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. యాప్ ద్వారా పనుల నమోదుకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ట్యాబ్‌లను ఇంజినీర్లకు అందజేశారు. అయినా పనుల నమోదు నుంచి బిల్లుల చెల్లింపుల దాకా అన్నీ ‘ఎంబీ’ ద్వారానే జరుగుతుండడం గమనార్హం.
ప్రతి పనికీ పక్కా లెక్క..
‘టీమ్’ యాప్‌ను వినియోగించేందుకు ఇంజినీరింగ్ పనుల్లో ప్రతి పనికీ ప్రత్యేక నంబర్‌ను కేటాయిస్తారు. పనులు ప్రతిపాదనల నుంచి కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపు వరకు సమస్త వివరాలు ఆ నంబర్‌తో యాప్‌లో నమోదు చేయగానే తెలుస్తాయి. పని ఎప్పుడు పూర్తయింది.. ఎంత మొత్తం చెల్లించింది కూడా తెలుస్తుంది. ఒకే పనికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు బిల్లు చేసుకునేందుకు కుదరదు. మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు.
మాడ్యూల్–1 కాంట్రాక్టర్‌తో పనుల ఒప్పందం పూర్తవగానే చేపట్టాల్సిన పనులు ఇందులో నమోదు చేస్తారు. ఒక్కో పనికి ప్రత్యేక నెంబర్ కేటాయించి పని కొలతల పరిశీలన, బిల్లుల తయారీ, ఆర్థిక విభాగానికి పంపించడం వంటివి ఇందులో ఉంటాయి.
మాడ్యూల్–2 పనిలో నాణ్యత లోపాలుంటే ఆ వివరాలు, దాని ఫలితాలు ఇందులో నమోదు చేస్తారు. ఇందుకు పనులు జరిగిన రోడ్ల నుంచి ర్యాండమ్‌గా శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించి ఫలితాన్ని యాప్‌లో నమోదు చేస్తారు.
మాడ్యూల్–3 చేయాల్సిన పని అంచనాల తయారీ నుంచి ఉన్నతాధికారుల తనిఖీ వరకు ఇందులో అప్‌లోడ్ చేస్తారు. పనుల విలువ రూ.10 కోట్లకు మించితే చీఫ్ ఇంజినీర్ తనిఖీ చేయాల్సి ఉంటుంది.
మాడ్యూల్–4 ఈ విభాగంలో కాంట్రాక్టు రేట్ల విశ్లేషణ ఉంటుంది. నిర్మాణ సామగ్రి ఎంత దూరం నుంచి తెచ్చారు. అందుకు రవాణా చార్జీలెంత తదితర వివరాలు నమోదు చేస్తారు.
డిజిటల్ సంతకాలు..
పనుల కొలతల ధ్రువీకరణకు అధికారుల డిజిటల్ సంతకాలు వినియోగిస్తారు. నగరంలో ప్రస్తుతం పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరిట వివిధ ప్రాంతాల్లో రోడ్ల పనులు జరుగుతున్నాయి. వీటిలో బీటీ, సీసీతో పాటు పేవర్‌బ్లాక్‌లు, మైక్రో సర్ఫేసింగ్ వంటి రకాల పనులు ఉన్నాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 720 కోట్లు మంజూరు చేసింది.
ప్రయోజనాలున్నా..
ట్యాబ్‌తో పాటు వెబ్‌లో నమోదు చేసే సదుపాయం వల్ల ఒకే పనిని రెండు పర్యాయాలు నమోదు చేయడాన్ని అడ్డుకోవడంతో పాటు జియో ట్యాగింగ్‌కు అవకాశం ఉంది. నేవిగేషన్‌తో ఇంటిగ్రేట్ చేసిన ఈ యాప్‌లో పనులు జరిగే ప్రాంతం నుంచే వాటి పురోగతి ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ వినియోగంతో ఏటా నాలుగు లక్షలకు పైగా పేపర్లు ఆదా అవుతాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ‘టీమ్’ యాప్ ద్వారా ఏటా దాదాపు పదివేల పనులను ఆన్‌లైన్‌లో రికార్డు చేయవచ్చని, నిర్వహణ పనులతో పాటు ప్రాజెక్టు పనులకు కూడా ఉపయోగించవచ్చని ప్రకటించింది. కానీ అమలు మాత్రం జరగడం లేదు.
ప్రభుత్వఅనుమతి కావాలి
‘టీమ్’ యాప్ ద్వారా పనుల నమోదు.. బిల్లుల చెల్లింపు సదుపాయం ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశాం. కానీ ఇంతవరకు ఆమో దం రాలేదు. కనీసం కమిషనర్ నుం చి తగిన ఉత్తర్వు అయినా అందాలి. ఇవేవీ లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేం. ఇంజినీరింగ్ పనుల చెల్లింపులు చేయలేం. ఆన్‌లైన్‌లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు అకౌంట్స్ విభానికి యాక్సెస్ ఉండాలి. ఈ కారణాల వల్ల పాత పద్ధతిలోనే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి.– జియావుద్దీన్, చీఫ్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment