పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక.. బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు | Prime Minister Calls For Elections As UK Shakes Off Recession | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక.. బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు

Published Fri, May 24 2024 3:15 PM | Last Updated on Fri, May 24 2024 4:08 PM

Prime Minister Calls For Elections As UK Shakes Off Recession

పార్లమెంటరీ ప్రాజాస్వామ్యానికి మాతృకగా పరిగణించే ఇంగ్లండ్‌లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన (జూన్‌ 4) నెల రోజులకు అంటే వచ్చే జులై 4న బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని మొత్తం 650 సీట్లకు పోలింగ్‌ నిర్వహించడానికి ఇంగ్లండ్‌ రాజు నుంచి చార్లెస్‌ 3 నుంచి అనుమతి తీసుకున్నారు.

భారత సంతతికి చెందిన యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే) ప్రధాని రిషి సునాక్‌.. దాదాపు రెండు పార్టీల వ్యవస్థ స్థిరపడిన ఇంగ్లండ్‌లో 2010 నుంచీ కన్సర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. ఇండియాలో కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగానే ఇంగ్లండ్‌లో సుదీర్ఘ చరిత్ర (190 ఏళ్లు) ఉన్న పార్టీ కన్సర్వేటివ్‌ పార్టీ. ఈ పార్టీకి తన పూర్వ రూపమైన టోరీ పార్టీ అని కూడా పేరుంది.

ప్రస్తుత బ్రిటిష్‌ పార్లమెంటు పదవీకాలం 2025 జనవరి వరకూ ఉన్నా దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడడానికి ప్రజల మద్దతు కోసం ముందస్తు ఎన్నికలు జరిపించడానికి ప్రధాని సునాక్‌ నిర్ణయించడం విశేషం. బుధవారం యూకే రాజు మూడో చార్లెస్‌ తో మాట్లాడి పార్లమెంటును రద్దుచేయించి, ఎన్నికలు జరిపించడానికి ప్రధాని అనుమతి తీసుకున్నారు.

124 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రస్తుత ప్రతిపక్షం లేబర్‌ పార్టీ చివరి ప్రధాని గోర్డన్‌ బ్రౌన్‌ నుంచి కన్సర్వేటివ్‌ పార్టీ ఇంగ్లండ్‌లో అధికారం హస్తగతం చేసుకున్నపటి నుంచి ఇప్పటి వరకూ ఈ 14 సంవత్సరాల్లో సునాక్‌ సహా ఐదుగురు ప్రధానులు మారారు. 2010 మేలో డేవిడ్‌ కేమరూన్‌ తో మొదలైన కన్సర్వేటివ్‌ పార్టీ హయాంలో ఆయన తర్వాత వరుసగా థెరిసా మే, బోరిస్‌ జాన్సన్, లిజ్‌ ట్రస్, రిషి సునాక్‌ ప్రధాని పదవి చేపట్టారు. ఈ ఐదుగురులో డేవిడ్‌ కేమరూన్‌ ఎక్కువ కాలం  (2010–2016 మధ్య 6 ఏళ్ల 64 రోజులు) అధికారంలో ఉన్నారు. ఆయన తర్వాత కన్సర్వేటివ్‌ పార్టీకే చెందిన థెరిసా మే, బోరిస్‌ జాన్సన్‌ చెరో మూడు సంవత్సరాలు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ పదవీకాలం గరిష్ఠంగా 5 ఏళ్ల వరకూ ఉంటుంది.

వివాదాస్పద ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హయాంలో టోరీ పార్టీకి భారీ మెజారిటీ!
ఒక తాత వైపు నుంచి టర్కీ కుటుంబ నేపథ్యం ఉన్న బోరిస్‌ జాన్సన్‌ హయాంలో కిందటిసారి 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ పార్టీకి మెజారిటీ (365 సీట్లు) లభించింది. అయితే, కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించి విందులో పాల్గొన్నారనే కారణంగా 2022 సెప్టెంబర్‌ మొదటి వారం జాన్సన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తర్వాత ప్రధాని అయిన మూడో మహిళా నేత లిజ్‌ ట్రస్‌ ఒక ప్రభుత్వ సంక్షోభం వల్ల 50 రోజులకే రాజీనామా చేశారు. ఇలా ఆమె బ్రిటన్‌ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు.

అనుకోని పరిస్థితుల్లో 2022 అక్టోబర్‌ 25న ఇంగ్లండ్‌ ప్రధాని పదవి చేపట్టిన తొలి హిందువుగా చరిత్ర సృష్టించిన 'రిషి సునాక్‌'ది పంజాబీ కుటుంబ నేపథ్యం. ఆయన భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి, సుధా మూర్తిల అల్లుడనే విషయం తెలిసిందే. తన సంపదకు తోడు భార్య అక్షత ఆస్తి తోడవడంతో యూకేలో రాజు మూడో చార్లెస్‌ కన్నా ఎక్కువ సంపద ఉన్న వ్యక్తిగా ఇటీవల సునాక్‌ వార్తల్లో నిలిచారు.

గతంలో ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థికవ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ గతేడాది ఆ హోదాను కోల్పోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సునాక్‌ ప్రధాని పదవి చేపట్టిన 2022 అక్టోబర్‌ నెలలో దేశంలో 11 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని కన్సర్వేటివ్‌ సర్కారు సగానికి తగ్గించగలిగింది. అయితే, 2023 చివర్లో సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి ఇంగ్లండ్‌ ప్రవేశించడంతో కన్సర్వేటివ్‌ పార్టీ విధానాలపై ఇంగ్లిష్‌ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రధాన ప్రతిపక్షమైన లేబర్‌ పార్టీకి ఇప్పుడు మెజారిటీ ప్రజల సానుకూలత ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. లేబర్‌ పార్టీ నేత కియర్‌ స్టార్మర్‌ (61) 2020 నుంచీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కుటుంబ సంబంధ ఆర్థికపరమైన వివాదాలతోపాటు, దేశంలో ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడిన 44 ఏళ్ల రిషి సునాక్‌ జులై 4 ఎన్నికల్లో తన పార్టీని మెజారిటీ దిశగా (650 సీట్లలో కనీసం 326) నడిపించి రెండోసారి ప్రధాని అవుతారా? అనేది మిలియన్‌ పౌండ్ల ప్రశ్నగా మారింది.


- విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement