తినుబండారాల దొంగలకు షెఫ్ విజ్ఞప్తి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్‌లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి.
టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు.
తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి.
పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది.
రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment