York City
-
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
తొలి కాలుష్యరహిత నగరం ‘యోర్క్’
లండన్ : కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం గణనీయంగా తగ్గిన విషయం తెల్సిందే. బ్రిటన్‌లో పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు పొందిన యోర్క్ నగరం ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని నగరంలో కేవలం సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. కరోనా కట్టడి భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన నాటి నుంచి ప్రజా రవాణాలకు ఈ రెండింటిని మాత్రమే అనుమతించాలని నగర కౌన్సిల్ నిర్ణయించింది. నగరంలో సైకిళ్లను ప్రోత్సహించేందుకు రవాణా మంత్రి గ్రాండ్ షాప్స్ ఏకంగా రెండు బిలియన్ పౌండ్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. చారిత్రక కట్టడాలు కలిగిన యోర్క్ నగరంలో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా 2023 సంవత్సరం నుంచి ప్రైవేటు కార్లను నిషేధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేశాక సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్లను మినహా మరే ఇతర వాహనాలను అనుమతించరాదని నిర్ణయించింది. ( కరోనాతో లింక్ ఉన్న మరో వ్యాధి బట్టబయలు ) బ్రిటన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక నగరం ఇదే! బ్రిటన్ మొత్తం మీద కాలుష్య రహిత నగరంగా ఇదే చరిత్రకెక్కనుందని కౌన్సిలర్లు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో అత్యవసరంగా ప్రజలు నగరంలో సైకిళ్లపై తిరగడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోందని లిబరల్ డెమోక్రట్ కౌన్సిలర్ పావులా విడ్డోసన్ వ్యాఖ్యానించారు. ఈ నగరాన్ని ఏడాది 70 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. ( కరోనా: బుర్జ్ ఖలీఫా..12 లక్షల భోజనాలు! ) -
ప్రైవేటు కార్లను నిషేధిస్తున్న తొలి సిటీ
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్‌తో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రైవేటు కార్లను పూర్తిగా నిషేధిస్తున్న తొలి నగరం బ్రిటన్‌లోని యార్క్ సిటీ. పబ్లిక్ రవాణా బస్సులు, దివ్యాంగులను తీసుకెళ్లే వాహనాలు మినహా మిగతా ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేటు వాహనాలన్నింటిని నిషేధించాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ నిషేధం సిటీవాల్స్ వరకు, నగరం చుట్టూ నిర్మించిన గోడల పరిధి వరకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. నగరం చుట్టూ రోమన్ కాలంలో నిర్మించిన గోడలు ఇప్పటికీ అక్కడ బలంగానే ఉన్నాయి. పబ్లిక్ రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా పెట్రోలు, డీజిల్ కార్లే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను కూడా నిషేధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏటా 70 లక్షల మంది పర్యాటకులు వచ్చే ఈ నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉంది. కాలుష్యానికి కారణం పర్యాటకులంటూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ విమర్శలను పర్యాటకుల మీదకు నెట్టింది. నగరంలోని 12 ప్రాంతాల్లో కాలుష్య ప్రమాణాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో 2030 నాటికల్లా నగరంలో కర్బన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకరావాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకొంది. అందులో భాగంగా 2023 నాటికి నగరంలో సంపూర్ణ కార్ల నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే నేపథ్యంలోనే 2021 సంవత్సరం నాటికి డీజిల్ కార్లను సంపూర్ణంగా నిషేధించాలని బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరం నిర్ణయం తీసుకుంది.