న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్‌తో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రైవేటు కార్లను పూర్తిగా నిషేధిస్తున్న తొలి నగరం బ్రిటన్‌లోని యార్క్ సిటీ. పబ్లిక్ రవాణా బస్సులు, దివ్యాంగులను తీసుకెళ్లే వాహనాలు మినహా మిగతా ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేటు వాహనాలన్నింటిని నిషేధించాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ నిషేధం సిటీవాల్స్ వరకు, నగరం చుట్టూ నిర్మించిన గోడల పరిధి వరకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. నగరం చుట్టూ రోమన్ కాలంలో నిర్మించిన గోడలు ఇప్పటికీ అక్కడ బలంగానే ఉన్నాయి.
పబ్లిక్ రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా పెట్రోలు, డీజిల్ కార్లే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను కూడా నిషేధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏటా 70 లక్షల మంది పర్యాటకులు వచ్చే ఈ నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉంది. కాలుష్యానికి కారణం పర్యాటకులంటూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ విమర్శలను పర్యాటకుల మీదకు నెట్టింది. నగరంలోని 12 ప్రాంతాల్లో కాలుష్య ప్రమాణాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో 2030 నాటికల్లా నగరంలో కర్బన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకరావాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకొంది.
అందులో భాగంగా 2023 నాటికి నగరంలో సంపూర్ణ కార్ల నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే నేపథ్యంలోనే 2021 సంవత్సరం నాటికి డీజిల్ కార్లను సంపూర్ణంగా నిషేధించాలని బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment